అతిపెద్ద సినిమా కంపెనీల్లో ఒకటైన వాల్ట్ డిస్నీ మరో దిగ్గజ కంపెనీ ‘21వ సెంచరీ ఫాక్స్’ను కొనుగోలు చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన మెజారిటీ ఆస్తులను 52.4 బిలియన్ డాలర్లకు (రూ. 3.4 లక్షల కోట్లకు) సొంతం చేసుకోవడానికి డీల్ కుదిరింది. ఈ విషయాన్ని తాజాగా వాల్ట్ డిస్నీ ప్రకటించింది. మీడియా మొఘల్ అనే పేరు సొంతం చేసుకున్న రూపర్ట్ ముర్దోక్ ఫాక్స్ బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్, దాని స్టేషన్లు, ఫాక్స్ న్యూస్ ఛానల్, ఫాక్స్ స్పోర్ట్స్ ఛానల్స్ తనవద్దనే ఉంచుకొని మిగిలిన ఆస్తులను వాల్ట్ డిస్నీకి అప్పగించనున్నారు.
డిస్నీకి బదిలీ కానున్న ఆస్తులలో ఫాక్స్ మూవీ, టీవీ స్టూడియోలు, కేబుల్ ఛానళ్ళు ఉన్నాయి. 21వ సెంచరీ ఫాక్స్ కంపెనీలోని ఇతర పెట్టుబడిదారులకు మిగిలిన ఆస్తుల్లో కొన్నిటిని అమ్మనున్నారు. కంపెనీకి చెందిన రూ. 89 వేల కోట్ల అప్పును కూడా వాల్ట్ డిస్నీ స్వీకరిస్తోంది. కంపెనీ అమ్మకంపై మొదట నవంబర్ 6న వార్తలు వచ్చాయి. అమెరికాలో ‘మాస్ మీడియా పవర్ హౌస్’గా భావించే 21వ సెంచరీ ఫాక్స్ కంపెనీకి చెందిన మెజారిటీ ఆస్తులు ఇక వాల్ట్ డిస్నీ సొంతం కానున్నాయి.