210 ప్రభుత్వ వెబ్ సైట్లలో ఆధార్ డేటా వెల్లడి

ఆధార్ చాలా భద్రం… నమోదైన పౌరుల వివరాలు బహుగోప్యం… కేంద్ర ప్రభుత్వమూ, యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పదే పదే చెప్పిన మాటలివి. ఇప్పుడదే అధారిటీ చెబుతోంది… సాక్షాత్తు ప్రభుత్వ శాఖలే వివిధ పథకాల లబ్దిదారుల ఆధార్ వివరాలను బహిరంగంగా వారి వెబ్ సైట్లలో పెట్టాయని! ఇది ఆధార్ మార్గదర్శకాలకు గండి కొట్టడమేనని..!! కేంద్ర ప్రభుత్వంలో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలోని వివిధ శాఖలు తమకు చెందిన 210 వెబ్ సైట్లలో లబ్దిదారుల పేర్లు, అడ్రస్ లు బహిర్గతం చేశాయని యుఐడిఎఐ తాజాగా వెల్లడించింది.

సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులుగా ఆధార్ అధారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆధార్ మార్గదర్శకాలకు గండికొట్టినట్టు గమనించి ఆయా వెబ్ సైట్లనుంచి సమాచారాన్ని తొలగించినట్టు కూడా అధారిటీ తెలిపింది. అయితే, ఈ తప్పు ఎప్పుడెప్పుడు జరిగిందన్న విషయం మాత్రం చెప్పలేదు. అధారిటీ ద్వారా మాత్రం ఎప్పుడూ ఎవరి వివరాలూ వెల్లడించలేదని స్పష్టం చేసింది.

‘కేంద్ర ప్రభుత్వాల శాఖలు, వాటి పరిధిలోని విద్యా సంస్థలకు చెందిన సుమారు 210 వెబ్ సైట్లు.. తమ పరిధిలోని లబ్దిదారుల పేర్లు, అడ్రస్ లు, ఆధార్ నెంబర్లు, ఇతర వివరాలను సాధారణ ప్రజల సమాచారంకోసం బహిరంగంగా ప్రదర్శించాయి’ అని యుఐడిఎఐ తన సమాధానంలో పేర్కొంది. దేశంలోని పౌరులకు యుఐడిఎఐ 12 అంకెల ఆధార్ నెంబర్ ను జారీ  చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడున్నా ఆ నెంబరే గుర్తింపు కార్డుగా పని చేస్తుంది. ప్రజలు ఇచ్చే సమాచారమంతా భద్రంగా ఉంటుందని యుఐడిఎఐ, కేంద్ర ప్రభుత్వం అభయమిచ్చిన నేపథ్యంలో ఆధార్ నమోదు పెరిగింది.

ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందేవారికి ఆధార్ వివరాలివ్వడం తప్పనిసరి చేసే ప్రక్రియ ఓవైపు కొనసాగుతోంది. ఇప్పుడు నగదు రహిత చెల్లింపులకు, బ్యాంకు అకౌంట్లకు, చివరికి ఫోన్ నెంబర్లకూ ఆధార్ ను అనుసంధానిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆధారే సర్వ రోగ నివారిణి! ప్రతి గుర్తింపునకూ, ప్రతి లబ్దికీ ఆధారే కొలమానం. ఆధార్ వ్యక్తిగత గోప్యతకు భంగకరమనే ఆందోళనను కొట్టిపారేసి కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో బలవంతంగా ప్రవేశపెట్టింది.

ఆధార్ నమోదులోనే అవకతవకలు జరిగినట్టు అనేక సందర్భాలలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆధార్ సమాచారమూ బహిర్గతం కావడం చూస్తున్నాం. అయితే, ఇప్పటికీ యుఐడిఎఐ మాత్రం ఆధార్ చాలా భద్రమనే చెబుతోంది. ఆధార్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేసిన బహుళ అంచెల భద్రతా వ్యవస్థ అని తాజా ఆర్టీఐ సమాధానంలోనూ సమర్ధించుకుంది.

Related posts

Leave a Comment