తన ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన షోయబ్ మాలిక్ పై రివెంజ్
ఫ్రెండ్లీ మ్యాచ్ కావడంతో రికార్డులకు ఎక్కని సెంచరీ
పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య జరిగిన ఓ టి10 చారిటీ మ్యాచ్ సంచలనాలకు వేదికైంది. ఒక ఓవర్లో ఆరు బంతులకూ వరుసగా సిక్సర్లు బాది షోయబ్ మాలిక్ కాలర్ ఎగురవేస్తే… ఆ ఓవర్ వేసిన బ్యాట్స్ మన్ తర్వాత తన వంతు వచ్చినప్పుడు ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి షోయబ్ మాలిక్ టీమ్ పై పగ తీర్చుకున్నాడు. ఆదివారం ఫైసలాబాద్ నగరంలో జరిగిన షాహిద్ ఆఫ్రీది ఫౌండేషన్ క్రికెట్ మ్యాచ్ ఈ విన్యాసాలకు వేదికైంది. 26 బంతుల్లో సెంచరీ చేసిన ఆ బ్యాట్స్ మన్ పేరు బాబర్ అజం.
షాహిద్ ఆఫ్రీది ఫౌండేషన్ చారిటీ మ్యాచ్ లో ఫౌండేషన్ రెడ్ టీమ్ తరఫున ఆడిన మాలిక్, ఏడో ఓవర్లో ఏకంగా ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో 10 ఓవర్లలో మాలిక్ టీమ్ 210 పరుగులు సాధించింది. ఏడో ఓవర్ వేసిన పాకిస్తాన్ బ్యాట్స్ మన్ బాబర్ ఫౌండేషన్ గ్రీన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన బాబర్, వరుస సిక్స్, ఫోర్లతో 26 బంతుల్లో సంచరీ చేశాడు. దీంతో గ్రీన్ టీమ్ తొమ్మిది వికెట్లు చేతిలో ఉండగానే విజయం సాధించింది. బాబర్ సెంచరీలో 11 సిక్సర్లు, ఏడు బౌండరీలు ఉన్నాయి.
మొత్తంగా రెండు జట్లూ కలిపి 20 ఓవర్ల లోపే 400కు పైగా పరుగులు చేయడం విశేషం. అయితే, ఈ సంచలనాలేవీ క్రికెట్ రికార్డులకు ఎక్కడంలేదు. ఇది అధికారిక మ్యాచ్ కాకపోవడమే అందుకు కారణం. మొన్ననే ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ శ్రీలంక జట్టుపై కేవలం 35 బంతుల్లో 100 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో అప్పటికే ఉన్న ఆ రికార్డును రోహిత్ శర్మ సమం చేశారు.
కోహ్లీతో పోలిక
కాగా, బాబర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటిదాకా 36 వన్డేలు ఆడాడు. 58.6 సగటుతో 1758 పరుగులు సాధించాడు. అందులో ఏడు సెంచరీలు, మరో ఏడు అర్ద సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మిక్కీ ఆర్ధర్ యువ ఆటగాడు అజంను భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చాడు. అయితే, కోహ్లీతో తనను పోల్చడం సరి కాదని అజం సున్నితంగా చెప్పాడు. కోహ్లీ ‘ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్ మన్’ అని, అంత పెద్ద ఆటగాడితో తనకు పోలిక లేదని అజం వినమ్రంగా బదులిచ్చాడు.