29న అయోధ్య కేసు హియరింగ్ రద్దు

2 0
Read Time:4 Minute, 17 Second
జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అందుబాటులో ఉండటంలేదని…
రాజ్యాంగ ధర్మాసనం సిటింగ్ రద్దు

అయోధ్య భూమి హక్కుల వివాదంపై విచారణకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 29వ తేదీన చేపట్టాల్సిన హియరింగ్ రద్దయింది. ఈమేరకు సుప్రీంకోర్టు ఆదివారం ఒక నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలలో ఒకరైన జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఆ రోజు అందుబాటులో ఉండటంలేదు కాబట్టి విచారణ చేపట్టడంలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు.

బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంలో విచారణకోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలో ఇంతకు ముందు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనంలో… ఇద్దరు జడ్జిలు ఇటీవలే మారారు. తాజా ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో పాటు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు.

‘‘ఇస్లాంలో… మసీదులో ప్రార్ధన అనివార్యమా?’’ అనే ప్రశ్నను ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి నివేదించడానికి నిరాకరిస్తూ 2018 సెప్టెంబర్లో తీర్పు చెప్పిన ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులు. జస్టిస్ అశోక్ భూషణ్ ఆ తీర్పును రాయగా… అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సమర్ధించారు. జస్టిస్ నజీర్ మాత్రం భిన్నాభిప్రాయాన్ని వెలువరించారు.

ఆ ప్రశ్న అయోధ్య కేసులో కీలకం అవుతుందని, అందువల్ల రాజ్యాంగ ధర్మాసనం దానికి జవాబు చెప్పడం అవసరమని జస్టిస్ నజీర్ అభిప్రాయపడ్డారు. ఆ కేసులో భిన్నాభిప్రాయలు వెలువరించిన ఇద్దరు జడ్జిలూ… అయోధ్య స్థల వివాదం విచారణకు ఏర్పాటైన ధర్మాసనంలోనూ ఉండటం విశేషం.

అయోధ్య కేసు విచారణకు షెడ్యూలును ఈ నెల 29వ తేదీన ప్రకటించాల్సి ఉండగా.. ఆ రోజు హియరింగ్ రద్దయింది. అయోధ్య స్థల వివాదంలో 120 అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. 88 మంది సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 13,886 పేజీలు, 257 డాక్యుమెంట్లు 15 ట్రంకు పెట్టెలలో సుప్రీంకోర్టులో ఓ సీల్డ్ గదిలో ఉన్నాయి.

ఈ డాక్యుమెంట్లు పర్షియన్, సంస్కృతం, అరబిక్, గురుముఖి, ఉర్దు, హిందీ సహా అనేక భాషల్లో ఉన్నాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన మూడు నివేదికలు ఎగ్జిబిట్లలో భాగం. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రింట్ లో 4304 పేజీలు ఉంది. వివిధ భాషల్లో ఉన్న డాక్యుమెంట్ల అనువాదాల కచ్చితత్వంపై అనుమానాలున్నాయి. నిపుణులతో వాటిని పరిశీలించాలని ఇంతకు ముందే ధర్మాసనం కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయోధ్య కేసు విచారణకు నిర్ణయించే షెడ్యూలు చాలా కీలకం కాబోతోంది. తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని నిర్మిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఆ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %