పెట్టుబడి ప్రతిపాదనలు రూ. 3000 కోట్లు..
‘అనంత’లో లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ
కియో అనుబంధ పరిశ్రమల పెట్టుబడి 4,995 కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజు కొరియా పర్యటన విశేషాలివి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొరియా పర్యటన తొలి రోజు పలు పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ముప్ఫయ్ ఏడు కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఇ.డి.బి) ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ తీసుకున్నది. ఆ ఒప్పందాలలోని పెట్టుబడి ప్రతిపాదనల విలువ మూడు వేల కోట్ల రూపాయలు కాగా..ఆయా సంస్థల ద్వారా మొత్తం 7,171 ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది.
మరో వైపు కియా అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ.4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. సోమవారం కొరియా పర్యటన ప్రారంభంలోనే ముఖ్యమంత్రి కియా మోటార్స్ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చంద్రబాబు అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలను కొరియా ప్రతినిధులు స్వాగతించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
నీటి శుధ్ధిపరిశ్రమలపై హేనోల్స్ కెమికల్స్ ఆసక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో హేన్సోల్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్ సమావేశమయ్యారు. భారత్ ఇప్పుడు శక్తిసామర్ధ్యాలున్న తయారీ కేంద్రగా రూపొందిందని, భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు స్టెఫాని చంద్రబాబుతో చెప్పారు. నీటి శుద్ధికి ఉపయోగపడే రసాయనాలు, స్మార్ట్ ఫోన్‌లో వాడే పెయింట్ ను తయారు చేస్తామని స్టెఫాని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని సూచించారు.
గ్రాన్ సియోల్ (జిఎస్) ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్ తదితరుల భేటీ
ఈ సమావేశం తరువాత గ్రాన్ సియోల్ (జీఎస్) ఇంజనీరింగ్ అండ్ కనస్ట్రక్షన్ కంపెనీ ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్లు టె జిన్ కిమ్, హూన్ హాంగ్ హూ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే స్టేడియం నిర్మాణాలలో జి.ఎస్ కంపెనీ ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా ఈ కంపెనీ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో ఉంది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలతో పాటు ముంబై, ఢిల్లీలలో జీఎస్ కు కార్యాలయాలున్నాయి. అమరావతి క్రీడానగరంలో పాలుపంచుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వంతెనలు, రహదారులు వంటి మౌలిక వసతుల నిర్మాణాల్లో భాగస్వాములు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.
‘అనంత’లో లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీ
బీటీఎన్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ సిటీని అనంతపురములో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. దక్షిణకొరియా-ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ఒప్పందంలో భాగంగా ఆ సిటీ ఏర్పాటు కానున్నది. పరిశ్రమల శాఖ, ఈడీబీలకు తగు ప్రతిపాదనలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
పోస్కో దేవూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ భేటీ
ముఖ్యమంత్రితో పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ జూసీబో సమావేశమయ్యారు. భారత్‌లో ఎల్ఎన్‌జీ వాల్వ్ చెయిన్ బిజినెస్‌పై పోస్కో ఆసక్తి ప్రదర్శించింది. ఉక్కు, రసాయనాలు, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలలో పాటు కమోడిటీ ట్రేడింగ్‌లో పోస్కో సంస్థకు విశేషానుభవం ఉంది. డౌన్ స్ట్రీమ్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రీపై సంస్థ ఆసక్తి చూపగా,కాకినాడ పరిసర ప్రాంతాలలోని పెట్రో కారిడార్‌లో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని సంస్థ ప్రతినిధులకు సీఎం వివరించారు.
హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్‌లీతో సమావేశం
తరువాత హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్ లీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నైలాన్ పాలిస్టర్, పవర్ సిస్టమ్ అంశాలలో హ్యోసంగ్‌కు అనుభవం ఉంది. టెక్స్‌టైల్స్, గార్మెంట్ పరిశ్రమలపై ఆసక్తిగా ఉన్నామని, భారత్‌లో తమ యూనిట్లను పెట్టేందుకు తగిన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నామని హ్యోసంగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. ఏ రాష్ట్రం ఇవ్వలేనంత ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఇస్తామని, ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
భౌగోళిక సానుకూల అంశాలు అనేకం ఏపీలోనే ఉన్నాయని, బ్రాండిక్స్ ఇప్పటికే వచ్చిందని, కొత్తగా కియా వచ్చిందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.