రాష్ట్రంలో నెలకు 4 లక్షలు చొప్పున మార్చి 31వ తేదీకల్లా 22 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగానికి టార్గెట్ ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యాచరణపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎం… మరుగుదొడ్ల నిర్మాణంలో అందరూ పోటీ పడాలని పిలుపునిచ్చారు. ’వారానికి 95,704 మరుగుదొడ్లు నిర్మించాలి, ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి. ఇప్పటికే 3జిల్లాలు ఓడిఎఫ్ చేశాం. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలను మరో రెండు నెలల్లో ఓడిఎఫ్ గా ప్రకటిస్తాం. తర్వాత ప్రకాశం, చిత్తూరు, అనంతపురం కూడా త్వరలోనే ఓడిఎఫ్ అవుతాయి. మిగిలినవి కూడా మార్చి31 కల్లా సిద్ధం కావాలి’ అని సిఎం పేర్కొన్నారు.
ఓడిఎఫ్ తర్వాత రాష్ట్రం ఓడిఎఫ్ ప్లస్ కు వెళ్ళాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతపై రాజీపడే ప్రసక్తేలేదని, ఒక్క పైసా కూడా అవినీతి జరగడానికి వీల్లేదని సిఎం స్పష్టం చేశారు. ’ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాకూడదు. 1100 కాల్ సెంటర్ నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. శుభ్రంగా ఉండాలి.. నాణ్యంగా ఉండాలి.. సకాలంలో పూర్తిచేయాలి. కలెక్టర్లు ఆమోదించిన డీలర్లనుంచే కొనుగోళ్లు జరపాలి. ఐఎస్ఐ నాణ్యత ఉన్న సరుకునే వినియోగించాలి. మరుగుదొడ్ల నిర్మాణమే కాదు.. వాటి వినియోగం కూడా సక్రమంగా జరిగేలా శ్రద్ధ వహించాలి. ఎంపిడివోలు పూర్తి బాధ్యత వహించాలి. గ్రామంలో జన్మభూమి కమిటీ నోడల్ ఏజన్సీగా ఉంటుంది. విద్యాశాఖ, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ భాగస్వాములుగా వ్యవహరించాలి’ అని సిఎం వివరించారు.
అక్టోబర్ 11కల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి 15 రోజులకు స్వచ్ఛాంధ్ర పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ విసర్జన రహితం (ఓడిఎఫ్)లో తన నియోజకవర్గం ముందుండాలనే స్ఫూర్తి ప్రజాప్రతినిధుల్లో రావాలని సిఎం పేర్కొన్నారు.