డిసెంబర్ మాసంలో 58 శాతమే… జనవరిలో 63 శాతానికి పెరిగింది
ఏప్రిల్ నాటికి ప్రజాసంతృప్తి 68 శాతం కావాలని టార్గెట్
టీడీపీ వర్క్ షాపులో ప్రజా ప్రతినిధులు, నేతలకు దిశానిర్దేశం
‘డిసెంబర్ లో ప్రజాసంతృప్తి 58% ఉంది. జనవరికి 63%కు పెరిగింది. ఏప్రిల్ కల్లా ప్రజా సంతృప్తి మరో 5%పెరగాలి. 68 శాతానికి పెంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ ప్రజా ప్రతినిధులకు, ముఖ్య నేతలకు టార్గెట్ విధించారు. ఇంటింటికీ తెలుగుదేశం, జన్మభూమి కార్యక్రమాల తర్వాత ముఖ్య నేతలకు ఆదివారం తన నివాస సముదాయంలోని సమావేశ మందిరంలో కార్యగోష్ఠి నిర్వహించిన ముఖ్యమంత్రి… ఇటీవల సాధించిన ఫలితాను, భవిష్యత్తులో సాధించాల్సిన కార్యక్రమాలను వివరించారు.
ఈ ఏడాది రాజకీయ ఏకీకరణపై దృష్టి పెట్టాలని, గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను కూడా దగ్గర చేసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. అందులో భాగంగానే ‘దళిత తేజం’ అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను పార్టీవైపు మళ్లించాలని నేతలకు హుకుం జారీ చేశారు. వారంతా టీటీపీకి మొగ్గితే 2019 ఎన్నికల్లో గెలుపు నల్లేరుమీద నడకే అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక ఎన్నికలో గెలుపు మాత్రమే మీ లక్ష్యం కాకూడదు. శాశ్వతంగా గెలవడం లక్ష్యం కావాలి. ఇంటింటికి తెలుగుదేశం, జన్మభూమి-మావూరు కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఇదే స్ఫూర్తితో జనవరి 26నుంచి ‘దళితతేజం-తెలుగుదేశం’ విజయవంతం చేయాలి’’ చంద్రబాబు
గతంలో ప్రభుత్వ వ్యతిరేకత గెలుపోటములను నిర్ణయించేదని, ఇప్పుడు ప్రభుత్వ సానుకూలత గెలుపోటములను నిర్దేశిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ అంశం ఆధారంగానే కొన్నిరాష్ట్రాలలో అధికార పార్టీలు 15ఏళ్లు, 20ఏళ్లు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో మమేకం కావడం అంతే ముఖ్యమన్నారు. రాయలసీమలో ఇప్పటికీ శ్రీకృష్ణదేవరాయలును స్మరించుకుంటున్నారని, గోదావరి పుష్కరాలలో ఇంటిపెద్ద మాదిరి కాటన్ కు పిండప్రదానం చేశారని ముఖ్యమంత్రి ప్రస్తుతించారు.
నీళ్లు ఇచ్చినవారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్న చంద్రబాబు…‘పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి పారదర్శకంగా, విమర్శలకు అతీతంగా చేస్తున్నాం. మొత్తం 28ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. నీటి భద్రత ఇస్తున్నాం. విభజన తర్వాత రెండు నెలల్లోనే కరెంటు కొరతను అధిగమించాం. 100% కరెంటు కనెక్షన్లు ఇచ్చాం..100% వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. అన్న క్యాంటిన్లు, నిరుద్యోగ భృతి హామీలను త్వరలోనే నెరవేరుస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడున్నరేళ్లలో చేసినన్ని పనులు, కలిగిన సంతృప్తి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నేను పొందలేదన్నారు.
పనులు చేయడం ఎంత ముఖ్యమో రాజకీయ ఏకీకరణ అంతే ముఖ్యమన్న చంద్రబాబు… ‘175సీట్లలో గెలుపే మన లక్ష్యం కావాలి, నమ్మకం, నాయకత్వ సామర్ధ్యంతోనే అది సాధ్యం. మన సమర్ధతను, ప్రవర్తనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్లో రోజురోజుకు మంచి అభిప్రాయం పెంచుకోవాలి. సమర్ధ నాయకత్వం ఇవ్వాలి’ అని చంద్రబాబు హితవు పలికారు.