7 దశల్లో లోక్ సభ ఎన్నికలు… మే 23న ఫలితాలు

8 0

లోక్ సభకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు 7 దశల్లో పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఆదివారంనాడు షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 11న మొదలై మే 19వ తేదీతో పోలింగ్ ముగుస్తుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూలును వెల్లడించారు. లోక్ సభ లోని 543 సీట్లతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్రంలో కేవలం లోక్ సభ ఎన్నికల వరకే నిర్వహించడానికి ఈసీ నిర్ణయించింది.

దశలవారీగా పోలింగ్

తొలి దశ ఏప్రిల్ 11

రెండో దశ ఏప్రిల్ 18

మూడో దశ ఏప్రిల్ 23

నాలుగో దశ ఏప్రిల్ 29

ఐదో దశ మే 6

ఆరో దశ మే 12

ఏడో దశ మే 19

తొలి దశలో 91 లోక్ సభ సీట్లకు, రెండో దశలో 97 లోక్ సభ సీట్లకు, మూడో దశలో అత్యధికంగా 115 లోక్ సభ సీట్లకు, నాలుగో దశలో 71 లోక్ సభ సీట్లకు, ఐదో దశలో అతి తక్కువగా 51 లోక్ సభ సీట్లకు, ఆరో దశలో 59 లోక్ సభ సీట్లకు, ఏడో దశలో మరో 59 లోక్ సభ సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు.

తొలి దశ పోలింగ్ జరిగే 91 సీట్లలో 42 తెలుగు రాష్ట్రాల్లోనివే కావడం విశేషం. అదే రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా పోలింగ్ జరగనుంది. 2014, 2009 ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రకు ఒక దశలో, మిగిలిన జిల్లాలకు మరో దశలో ఎన్నికలు నిర్వహించారు. అదీ కూడా తొలి రెండు దశల్లో కాదు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఒకే విడతలో, అదీ... తొలి దశలోనే పోలింగ్ నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.