7.1 కాదు.. 8.2 శాతం..! పెద్ద నోట్లు రద్దయిన ఏడాది జీడీపీ బాగా పెరిగిందట!!

5 0
Read Time:4 Minute, 12 Second
‘‘సవరించిన డేటా’’ను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు

జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) డేటా విషయంలో ఇప్పటికే అనేక పిల్లిమొగ్గలు వేసిన కేంద్ర ప్రభుత్వం… తాజాగా మరో ట్విస్టు ఇచ్చింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీడీపీ లెక్కలను తాజాగా సవరించింది. రెండేళ్లలోనూ ఇంతకు ముందు అంచనాలకంటే
వృద్ధి రేటును పెంచి చూపించింది.

గత అంచనాల ప్రకారం 2017-18లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయగా… తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం అది 7.2 శాతానికి పెరిగింది. డీమానెటైజేషన్ చేపట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరంలోనైతే వృద్ధి రేటు 8.2 శాతం నమోదైనట్టు అనూహ్యమైన స్థాయిలో సవరించింది.

2016-17 ఆర్థిక సంవత్సరం నవంబర్ మాసంలో పాత రూ. 1000, 500 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ప్రజలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆర్థిక వ్యవస్థ పెద్ద కుదుపునకు గురైంది. ఈ నేపథ్యంలో 2017 జూలైలో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కొన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.

ఆయా చర్యల ఫలితంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి మందగించింది. అయితే, 2016-17లో 7.1 శాతం, 2017-18లో 6.7 శాతం చొప్పున జీడీపీ పెరిగినట్టుగా ఇంతకు ముందు లెక్కలు తేల్చారు. అయితే ఇప్పుడు… డీమానెటైజేషన్ సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 7.1 శాతం కూడా కాదని, ఏకంగా 8.2 శాతం మేరకు నమోదైందని తాజాగా కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఒ) వెల్లడించింది.

అంటే… మోడీ ఐదేళ్ళ పాలన మొత్తంలో డీమానెటైజేషన్ జరిగిన సంవత్సరమే అత్యధిక వృద్ధి రేటు నమోదైందన్నమాట! ఈ అసాధారణ సవరణలపై అప్పుడే ఆక్షేపణలు మొదలయ్యాయి. ప్రతికూల ప్రభావంతో వృద్ధి రేటు మందగించిన సంవత్సరాల్లోనే అత్యధికంగా చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

విశేషమేమంటే… డీమానెటైజేషన్ జరిగిన సంవత్సరంలో అధిక వృద్ధి రేటుకు పారిశ్రామికాభివృద్ధి కారణమని ఇంతకు ముందు చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల వృద్ధి రేటును తగ్గించి చూపించింది. జీడీపీ పెరుగుదల 7.1 శాతం ఉందన్నప్పుడు పారిశ్రామికాభివృద్ధి 9.2 శాతం జరిగిందని చెప్పారు. తాజాగా సవరించిన అంచనా ప్రకారం ఆ ఏడాది పారిశ్రామిక వృద్ధి రేటు 7.9 శాతమే.

క్షేత్ర స్థాయి పరిస్థితులకు తాజా డేటాకు పొంతన లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డీమానెటైజేషన్ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందిందన్న మాట వాస్తవ పరిస్థితులకు తగినట్టుగా లేదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. కార్పొరేట్ ఫలితాలుగానీ, వ్యవసాయ రంగంగానీ తాజా సవరణను బలపరిచేలా లేవని ఆయన చెప్పారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %