ఇండియా క్రూయిజ్ మిసైల్ ప్రయోగం విజయవంతం

ఇండియా మొట్టమొదటిసారి దేశీయంగా రూపొందించిన ఒక సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. దాని పేరే నిర్భయ్. న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా ప్రయోగించేలా ఈ మిసైల్ రూపొందింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించిన నిర్భయ్… వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ఒడిషాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లాంఛర్ ద్వారా మంగళవారం నిర్భయ్ మిసైల్ పరీక్ష జరిగింది. ఇండియా, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ 290 కిలోమీటర్ల వరకు వార్ హెడ్లను మోసుకెళ్ళగలదు. కాగా, నిర్భయ్ దానికి మరింత బలం చేకూర్చే విధంగా రూపొందింది.

ఏమిటి ప్రత్యేకత?

నిర్భయ్ సాలిడ్ రాకెట్ బూస్టర్ తో అత్యధునిక నేవిగేషన్ వ్యవస్థ ద్వాారా గైడ్ చేయబడుతుంది. ఏకంగా 24 రకాల ఆయుధాలను మోసుకెళ్ళగలదు. బహుళ లక్ష్యాలను ఒకేసారి ఛేదించగల శక్తి దీని సొంతం. గత ఐదేళ్ళలో నిర్భయ్ మిసైల్ ను ప్రయోగించడం ఇది ఐదోసారి. ఇంతకు ముందు ఒకేసారి మిసైల్ ప్రయోగం విజయవంతం కాగా మూడుసార్లు విఫలమైంది.

2013 మార్చి 12న తొలి పరీక్షలో విఫలమైన నిర్భయ్, 2014లో రెండో ప్రయోగంలో విజయవంతమైంది. తర్వాత రెండుసార్లు విఫల ప్రయోగాల తర్వాత తాజాగా జరిగిన ఐదో ప్రయోగంలో విజయవంతంగా లక్ష్యాన్ని సాధించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. మిసైల్ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించిందన్నది సమాచారం.

Leave a Comment