టవర్ రూపంలో అసెంబ్లీ… మంత్రిమండలి నిర్ణయాలివీ…

సుదీర్ఘ కసరత్తు తర్వాత అమరావతి అసెంబ్లీ డిజైన్ ఖరారైంది. ఐకానిక్ భవనంగా నిర్మించాలని తలపెట్టిన అసెంబ్లీకోసం నార్మన్ ఫోస్టర్ రూపొందించిన నమూనాల్లో టవర్ రూపానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. వివిధ రకాలుగా చేసిన అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ఈ నమూనాకు ఓటు వేసిన నేపథ్యంలో… శనివారం సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం ‘టవర్ అసెంబ్లీ’కి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఇఛ్చానుసారం డీజీపీని నియమించుకునేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయించిన మంత్రి మండలి…పోలవరం, ఫైబర్ నెట్ తదితర అంశాలకు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

మంత్రి మండలి నిర్ణయాలివీ…
అసెంబ్లీ డిజైన్
  • రాష్ట్ర శాసనసభ కోసం నార్మన్ ఫోస్టర్ రూపొందించిన స్పైక్ మోడల్/టవర్ డిజైన్‌కు మంత్రిమండలి మొగ్గుచూపింది.
  • సమావేశం చివరలో ఫోస్టర్ ఆకృతులను పరిశీలించిన మంత్రిమండలి టవర్ డిజైన్‌పై ఆసక్తి చూపించింది.
  • ఫోస్టర్ అందించిన డిజైన్లలో ఇదే అత్యుత్తమంగా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
డీజీపీ నియామకంకోసం చట్ట సవరణకు ఆర్డినెన్స్
  • డీజీపీ నియామకం విషయంలో ఇప్పుడు అమలులో ఉన్న చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.
  • ఈ నియామకంపై చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు జారీ చేయడానికిమంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • ఈ ఆర్డినెన్సుతో డీజీపీ నియామకం ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వమే చేసేందుకు అవకాశం లభిస్తుంది.
  • త్వరలో సమగ్రమైన పోలీసు చట్టాన్ని రూపొందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
  • డీజీపీ నియామకాన్ని ఇప్పుడు కొత్తగా రాష్ట్ర పరిధిలోకి తెచ్చేందుకు Act 9 of 2014ను సవరిస్తూ ఆర్డినెన్సు తీసుకురావడానికి మంత్రిమండలి నిర్ణయించింది.
  • AIS Act 1953కి లోబడి DGP పదవీకాలం నిర్ణయించే విధంగా ఈ ఆర్డినెన్సు ఉంటుంది.
పోలవరం ప్రాజెక్టు

• పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ పనులకోసం ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ మొత్తాన్ని స్వాధీనపరుచుకోవడాన్ని మరో ఏడాది పొడిగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 2018కి నిర్మాణ సంస్థ మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించాల్సి వుంటుంది.
• పరిశోధన, సర్వే, డిజైన్లు-డ్రాయింగ్ రూపకల్పన, ఎల్‌పీ షెడ్యూల్, ఎర్త్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, 25.72 మీటర్ల వరకు స్పిల్ వే-దాని అనుబంధ పనులు, 960 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రానికి పునాది తవ్వకం, అప్రోచ్ చానల్, టెయిల్ రేస్ పూల్, టెయిల్ రేస్ చానల్ తదితర పనులకు సంబంధించి మిషనరీ, లేబర్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద నిర్మాణ సంస్థకు ప్రభుత్వం రూ. 404.85 కోట్లు ఇవ్వగా, 2017 అక్టోబర్ 31 వరకు వడ్డీ కింద మరో రూ. 124.70 కోట్లు అయ్యింది.
• మొత్తం రూ. 529.55 కోట్లను ఈ ఏడాది అక్టోబర్ నాటికి చెల్లించాల్సి వుంది. నిర్మాణ సంస్థ ఈ చెల్లింపునకు మరో ఏడాది గడువు కోరింది. అయితే నిర్మాణ సంస్థ రూ. 485.83 కోట్లకు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇస్తోంది. మిగిలిన రూ. 43.87 కోట్లకు కూడా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధనను మంత్రిమండలి విధించింది.

ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం
  • డిసెంబర్ 27న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం.
  • ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం అనంతరం రెండు లక్షల మందితో జరిపే వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్రపతి పాల్గొంటారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌ను సందర్శించనున్నారు.
  • 27న నాగార్జున యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఆదేరోజు రాష్ట్ర సచివాలయానికి రానున్నారు.
చంద్రన్న పెళ్లి కానుక
  • ‘చంద్రన్న పెళ్లికానుక’ ఫిబ్రవరిలో ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
  • బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు ఈ కానుక అందిస్తారు. బీసీలకు రూ.30వేలు, ఎస్‌సీ, ఎస్‌టీలకు రూ.50వేలు పెళ్లికానుక ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
  • 2018లో సుమారు 40 వేల మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా.
పప్పుధాన్యాల కొనుగోళ్లకు ముగ్గురు మంత్రులతో కమిటీ
  • పప్పుధాన్యాల కొనుగోళ్లు సజావుగా సాగడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం.
  • ఆర్థికశాఖ, వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రులు ఈ కమిటీలో ఉంటారు. పప్పుధాన్యాల కొనుగోళ్ల అంశాన్ని పరిశీలించిముఖ్యమంత్రికి తగు సిఫారసులు చేస్తారు. అవసరం మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.
ట్రాన్స్‌జెండర్ పాలసీ
  • ప్రతిపాదిత ట్రాన్స్‌జెండర్ పాలసీపై మంత్రిమండలి కూలంకుషంగా చర్చించింది.దీనిని ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించింది.
  • ఈ పాలసీ అమలులోకి వస్తే 26 వేల మంది హిజ్రాలకు మేలు జరుగుతుంది.
  • 18 సంవత్సరాలు పైబడిన హిజ్రాలకు 1500 రూపాయిలు పెన్షన్ అందిస్తారు.
  • వీరు సమాజంలో గౌరవంగా జీవించడానికి వీలుగా రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. వారికి నైపుణ్య శిక్షణ అందించి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తారు.
  • పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖలు ట్రాన్స్‌జెండర్ల పట్ల సహృదయంతో మెలగాలని మంత్రిమండలి సూచించింది.
  • సమాజ నిరాదరణకు గురై భిక్షాటన, వేశ్యవృత్తిలో మగ్గిపోతున్న హిజ్రాలకు ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుంది.
  • చిన్నతరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తారు. సినిమా హాళ్లు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో వీరికి ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తారు. రాయితీతో కూడిన బస్‌పాసులు అందించడం, ఆర్టీసీ బస్సులలో ప్రత్యేకంగా ఒక సీటును కేటాయించడం చేస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా వీరికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారు.
కొత్తగా 9 అర్బన్ మండలాలు
  • రాష్ట్రంలో కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • విశాఖ అర్బన్ II, III, IV, విజయవాడ అర్బన్ II, III, IV, గుంటూరు అర్బన్ మండలం, నెల్లూరు అర్బన్ మండలం, కర్నూలు అర్బన్ మండలం నూతనంగా ఏర్పాటు కానున్నాయి. విశాఖ జిల్లాలోని విశాఖపట్నం అర్బన్, రూరల్ మండలాలు, కృష్ణాజిల్లాలోని విజయవాడ అర్బన్, రూరల్ మండలాలను పునర్ వ్యవస్థీకరిస్తారు.
గన్నవరంలో నూతనంగా కోర్టు ఏర్పాటు 
  • కృష్ణా జిల్లా గన్నవరంలో నూతనంగా అడిషనల్ ఛీఫ్ మెట్రోపాలిటన్ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  • ఈ కోర్టుకు అవసరమైన 27 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పోస్టులకు 2015 పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
  • దీనివల్ల ప్రభుత్వంపై రూ.కోటీ 46 లక్షల ఆర్థిక భారం పడుతుంది.
భూ కేటాయింపులు
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నర్ పోలూరు గ్రామంలో 39.55 ఎకరాల భూమిని PMAY హౌసింగ్ ఫర్ ఆల్ స్కీము కింద ఇళ్ల నిర్మాణ నిమిత్తం సూళ్లూరుపేట పురపాలక సంఘానికి అప్పగిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
అశోక్ లే ల్యాండ్ 
  • కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని 75 ఎకరాల భూమిని గ్రీన్‌ఫీల్డ్ ఎం&హెచ్‌సీవీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్, దాని అనుబంధ సంస్థల ఏర్పాటు నిమిత్తంచెన్నయ్‌కు చెందిన మెస్సర్స్ అశోక్ లేల్యాండ్ లిమిటెడ్‌కు కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం.
  • గతంలో RVR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చేసిన 25 ఎకరాల భూ కేటాయింపును రద్దుచేసి ఆ భూమిని కలిపి మొత్తం 75 ఎకరాలు అశోక్ లేల్యాండ్‌కు ఉచితంగా అందిస్తారు.
  • రెండు దశలలో ఎం&హెచ్‌సీవీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ సంస్థ రూ. 135 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
  • దీనివల్ల రెండు దశలలోనూ మొత్తం 2,295 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
మోహన్ స్పిన్‌టెక్ 
  • కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని సర్వే నెం:11లో 81 ఎకరాల భూమిని మెస్సర్స్ మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్‌కు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం.
  • ఇందులో ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్‌టైల్ యూనిట్ ఏర్పాటు కానున్నది. చదరపు మీటరు ఒక్కింటికీ రూ.408గా నిర్ణయించారు.
  • మొదటిదశలో రూ.328.14 కోట్లు, రెండవ దశలో రూ.275.85 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టనున్నారు.
  • మొదటి దశలో 1,547, రెండో దశలో 553 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన జరగనున్నది.
లాజిస్టిక్ పార్కు రోడ్డు ఏర్పాటుకు భూమి 
  • నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలం ఈపూరు బిట్ 1A (పెంటపాలెం)లో3.91 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ ఏర్పాటుచేయబోతున్న లాజిస్టిక్ పార్కుకు అప్రోచ్ రైల్/రోడ్ నిర్మాణం నిమిత్తం ఉచితంగా అందించడానికి మంత్రిమండలి ఆమోదం.
  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం ఏపూరు బిట్-2 గ్రామంలో సర్వే నెం. 2212 లో 11 ఎకరాల భూమిని PMAY పథకం కింద EWS గృహనిర్మాణం కోసం నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్‌కు ముందస్తుగా స్వాధీనపరుస్తూ కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది.
  • కృష్ణా జిల్లా నాగాయలంకమండలం గణపేశ్వరంలో ఆర్.ఎస్ నెం. 647లో 61 ఎకరాల భూమిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం నోటిఫై చేయడానికి అటవీశాఖకు అప్పగించేందుకు కలెక్టరుకు అధికారమిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. తీరంలోని మడ అడవులలో 381.61 ఎకరాలను డి.ఆర్.డి.ఓకు ఇచ్చినందుకు బదులుగా ఈ భూమిని అటవీశాఖకు అప్పగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Related posts

Leave a Comment