అంబానీని తాకని ఆర్థిక సంక్షోభాలు

2 0

  • ఏడాదిలో 67 శాతం పెరిగిన సంపద..

  • 38 బిలియన్ డాలర్ల నెట్ వర్త్..

  • ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో పదోసారీ నెంబర్ 1..

  • రెండో స్థానంలో ఉన్న ప్రేమ్ జీకి రెట్టింపు సంపద..

ఆర్థిక సంక్షోభాలు దరి చేరని అరుదైన సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అసాధారణంగా పెంచుకున్నారు. ముందే ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టిన వేళ డీమోనెటైజేషన్, జీఎస్టీలతో సాధారణ ప్రజలు ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా అంబానీ నెట్ వర్త్ మాత్రం ఏడాదిలో ఏకంగా 67 శాతం పెరిగింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ వెలువరించిన ర్యాంకుల ప్రకారం అంబానీ 38 బిలియన్ డాలర్ల సంపదతో ఇండియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అంటే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. ఇండియాలో అతి సంపన్నుడన్న ట్యాగ్ ను అంబానీ సొంతం చేసుకోవడం వరుసగా ఇది పదోసారి. అంబానీ వద్ద ఉన్న సంపదకు గత ఏడాది కాలంలో తోడైనదే 15.3 బిలియన్ డాలర్లు.

ఇండియా సంపద అంటే అంబానీ గుర్తుకు వచ్చేలా పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఫోర్బ్స్ ఇండియా జాబితాలో రెండో స్థానంలో ఉన్న విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీకి, అంబానీకి సైతం సంపదలో చాలా వ్యత్యాసం ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రేమ్ జీ సంపద 19 బిలియన్ డాలర్లు కాగా అంబానీ సంపద అందుకు రెట్టింపు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన "ఆర్థిక ప్రయోగాలు" అంబానీతో పాటు సంపన్నులనెవరినీ ప్రభావితం చేయలేకపోయాయని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. ఇండియాలోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఈ ఏడాది కాలంలో 26 శాతం పెరిగింది. ఇలా పెరిగిన వాళ్లలో చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన పేరు గౌతమ్ అదానీ. ఆయన 11 బిలియన్ డాలర్ల సంపదతో టాప్-10 ఇండియన్ల జాబితాలో చేరారు.

టాప్ 10 వీరే

ముకేష్ అంబానీ - 38 బిలియన్ డాలర్లు
అజీమ్ ప్రేమ్ జీ - 19 బిలియన్ డాలర్లు
హిందుజా సోదరులు - 18.4 బిలియన్ డాలర్లు
లక్ష్మి మిట్టల్ - 16.5 బిలియన్ డాలర్లు
పల్లోంజీ మిస్త్రీ - 16 బిలియన్ డాలర్లు
గోద్రెజ్ కుటుంబం - 14.2 బిలియన్ డాలర్లు
శివ నాడార్ - 13.6 బిలియన్ డాలర్లు
కుమార్ బిర్లా - 12.6 బిలియన్ డాలర్లు
దిలీప్ సంఘ్వి - 12.1 బిలియన్ డాలర్లు
గౌతమ్ అదానీ - 11 బిలియన్ డాలర్లు

తమ్ముడి సంపద తగ్గింది!

దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు ముకేష్ అంబానీ సంపద ఒక ఉదాహరణ. సంపన్నుల మధ్య కూడా అంతరాలు పెరుగుతున్నట్టు ఈసారి స్పష్టమైంది. ఒకటో స్థానానికి, రెండో స్థానానికి ఉన్న అంతరం 100 శాతం కాగా... ముఖేష్ అంబానీకి, ఆయన తమ్ముడు అనిల్ అంబానీకి మధ్య అగాథమే ఉందనుకోవాలి. 38 బిలియన్ డాలర్ల సంపదతో అన్న ఆసియాలోని టాప్ 5 సంపన్నుల్లో నిలవగా... తమ్ముడు అనిల్ అంబానీ 3.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో 45వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అనిల్ అంబానీ సంపద, ర్యాంకు గత సంవత్సరం కంటే తగ్గాయి. 2016లో అనిల్ 3.4 బిలియన్ డాలర్ల సంపదతో 32వ స్థానంలో ఉన్నారు.