అవధులు లేని స్ఫూర్తి ‘అమ్మ’

4 0
  • మరణం లేని మహాకావ్యానికి నాటక రూపం

  • విజయవాడలో ప్రదర్శన విజయవంతం

విజయవాడ సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియం కిటకిటలాడుతోంది. మాక్సిం గోర్కీ అమ్మ నవలను నాటక రూపంలో తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు హాజరయ్యారు. నాటకం మొదలైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీమ్ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. అవును... నాటకం బెంగాలీలోనే ప్రదర్శితమవుతోంది. ఆడిటోరియంలో ఉన్నవారిలో పట్టుమని 10 మందికి కూడా బెంగాలీ భాష తెలియకపోవచ్చు. కానీ, నాటకం ప్రదర్శిస్తున్నంత సేపూ ఆడిటోరియంలో అంతా శ్రద్ధగా తిలకించారు. రెండు గంటల నాటకం పూర్తయ్యేవరకూ కుర్చీలు ఖాళీ కాలేదు. ఎక్కడో రష్యాలో చేసిన రచన... తెలుగు ప్రజలకు తెలియని మరో భాషలో ప్రదర్శితమవుతుంటే... ఎవరూ కదలకుండా కూర్చొని చూడటం ఆశ్చర్యకరం.

అదే ’అమ్మ’కు ఉన్న శక్తి. ఎల్లలెరుగని స్ఫూర్తి. కాలం కాని కాలం.. దేశం కాని దేశం.. భాష తెలియని ప్రాంతం. అయితేనేం... భావం ప్రేక్షకుల మస్తిష్కాలను తాకింది. మరణం లేని ఓ మహాకావ్యం భావోద్వేగాల మధ్య కళ్ళ ముందు సాక్షాత్కారమైన వేళ... భాష అవరోధం కాలేదు. 111 సంవత్సరాల క్రితం ప్రచురితమైన అమ్మ నవల రష్యన్ విప్లవంలో కీలక పాత్ర పోషించింది. ఓ సాధారణ మహిళ విప్లవకారులకే స్ఫూర్తిదాయకంగా మారిన మహోన్నత గాథ... ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగానే ఉన్న విషయం శనివారం సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియాన్ని చూస్తే అర్ధమైంది. ప్రజా సాహితి మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆ సంస్థ కార్యకర్తలతోపాటు విజయవాడకు చెందిన చాలా మంది తిలకించారు.

’అమ్మ’ నాటకం టీమ్ 2000కు పైగా ప్రదర్శనలిచ్చినట్టు నిర్వాహకులు చెప్పారు. భాష తెలియని ప్రాంతాల్లో సైతం ఓ నాటకం విజయవంతం కావాలంటే కథా వస్తువు శక్తివంతమైనది అయి ఉండాలి. దానికి మంచి నటీ నటులు తోడవ్వాలి. ’అమ్మ’కు మించిన కథావస్తువు లేదు. నటీనటులు సమర్ధులైతే ప్రదర్శన లక్ష్యం నెరవేరుతుంది. ఈ విషయంలో కోల్ కత టీమ్ చాలావరకు విజయవంతమైంది. ప్రధాన పాత్రధారుల నటన బాగుంది. పాత్రోచితంగా గేయాలాపన చేయవలసి వచ్చినప్పుడు మంచి గాత్రం ఉన్న నటులు దొరికిన విషయం రుజువైంది. వీటికి సందర్భోచితమైన నేపథ్య సంగీతం తోడైంది. ఇవన్నీ.. అర్ధం కాని భాషలో నాటకం చూస్తున్నామన్న విషయాన్ని మరిపిస్తాయి.

రెండు అంకాలుగా అమ్మ నాటకం పూర్తయింది. నటీనటులను నిర్వాహకులు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆశ్చర్యం... రెండు గంటలపాటు నాటకానికి కేంద్ర బిందువైన ’అమ్మ’ పాత్రధారి అసలు మహిళే కాదు. ఈ పాత్రను ధరించింది గౌతం ముఖర్జీ. నాటకం మధ్యలో ఒకటి రెండుసార్లు చిన్నపాటి సందేహం వచ్చినా.. వెంటనే మరిపించేంతగా మహిళ పాత్రలో నటించారు ముఖర్జీ. ఇది కమ్యూనిస్టులే కాదు. అందరూ చూడవలసిన నాటకం. తెలుగులో వస్తే ఇంకెంత బాగుంటుందో.

అమ్మ నాటకాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు

Leave a Reply

%d bloggers like this: