ఏకపక్ష సభలో అధికారపక్షం ఫ్రెండ్లీ మ్యాచ్

admin
4 0
Read Time:9 Minute, 6 Second
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ సరికొత్త విన్యాసం

శాసనమండలిలో టీచర్ ఎమ్మెల్సీల రూపంలో విపక్షం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించగా మిత్రపక్షమైన బీజేపీతో కలసి అధికారపక్షమే సభను ఏకపక్షంగా నడిపించే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో ఈసారి అడుగుపెట్టిందే మూడు పార్టీలు. అందులో టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములు. ఉన్న ఒక్క ప్రతిపక్షమూ సభను బహిష్కరించింది. శాసన మండలిలో మాత్రం టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రూపంలో ప్రతిపక్షం కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఉన్నా లేకున్నా పీడీఎఫ్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు అక్కడ కొనసాగుతారు.

తమ పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకున్నా వారిపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాము శాసనసభా కార్యకలాపాలను బహిష్కరిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఏడాదిన్నర క్రితమే వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలలో ఒక్కరు మినహా మిగిలినవారంతా గత అసెంబ్లీ సమావేశాలనాటికే తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారిలో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిందీ  గత అసెంబ్లీ సమావేశాలకు ముందే..! అప్పుడెప్పుడూ బహిష్కరణ నిర్ణయం తీసుకోని ప్రతిపక్షం.. తాజా సమావేశాలను మాత్రం బహిష్కరించింది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ప్రతిపక్షం అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని సరికొత్తగా తీసుకుంది. ఫలితంగా… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాలు మొత్తం ఖాళీ అయ్యాయి. ఆర్నెల్ల వ్యవధితో సమావేశమైన అసెంబ్లీ ఏకపక్ష సభగా మారింది. దీన్ని అధికార పక్షం తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. అధికారిక ఎజెండాను తాము అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్తోంది. తొలి రోజు పట్టిసీమ ప్రాజెక్టుపై చర్చ అందులో భాగమే.

అధికార పక్షంలోనే ఫ్రెండ్లీ మ్యాచ్

ప్రత్యర్ధి జట్టు లేని బరిలో ఒకే పక్షం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడినట్టు… ప్రస్తుత శాసనసభలో అధికార పక్షంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. మంత్రులు అధికారపక్షమైతే… తాము ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వివిధ అంశాలపై మంత్రులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే డైరెక్షన్ ఇచ్చారు. నిరసనలు, సవాళ్ళు లేకుండా సభ ప్రశాంతంగా జరగడంవల్ల తమ పార్టీలోనే ఎక్కువమందికి ప్రశ్నలు వేసే అవకాశం వస్తుందని అధికార పార్టీ సభ్యులు భావిస్తున్నారు.

ప్రతిపక్షం లేదని సభను తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ వ్యూహరచనా సమావేశంలో తన పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. శాసనసభ వాయిదా పడిన తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అందుకోసం సీరియస్ గా సిద్ధమై రండి’ అని సూచించారు.

కొత్త తరహా శిక్షణ!

ఒక విధంగా ప్రస్తుత అసెంబ్లీ… అధికార పక్ష నేతల కొత్తతరహా శిక్షణకు వేదికగా మారింది. ’వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం లేని అసెంబ్లీని సీఎం చూడాలనుకుంటున్నారు. ఈ సమావేశాలు దానికి రిహార్సల్స్ గా మారాయి’ అని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి తామే అసెంబ్లీని వేదికగా చేసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. ‘పట్టిసీమ నీరు కాలువ చివరి భూములకు చేరడంలేదనే అంశాన్ని మా ఎమ్మెల్యేలే లేవనెత్తారు’ అని గుర్తు చేశారు.

శాసనసభ లాబీలలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘మంత్రులపై ప్రశ్నలు సంధించాలని మా సభ్యులనే ముఖ్యమంత్రి ఆదేశించారు’ అని లోకేష్ చెప్పారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ దీనికి స్పందిస్తూ.. ఆ ఆదేశాలను పాటించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, వైసీపీ వైరస్ లాంటిదని, వైరస్ లేకపోతే ఆరోగ్యం ఎంత బాగుంటుందో సభలో వైసీపీ లేకపోవడంవల్ల అంత ప్రశాంతంగా ఉందని ఆ పార్టీనుంచి తెలుగుదేశంలో చేరి మంత్రి పదవి పొందిన ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

స్వీట్లు పంచిన చినరాజప్ప

హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాస్యచతురతకు పెట్టింది పేరు. ఆయన శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వీట్లు పంచారు. ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరుగుతున్నాయని సంబరంతో స్వీట్లు పంచుతున్నారా? అని ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సరదాగా ప్రశ్నించారు. శాసన మండలి సభ్యుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాత్రం.. తమ సభే (మండలి) నయమని వ్యాఖ్యానించారు.

ఈసారి మండలి ఆసక్తికరం

టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రూపంలో శాసనమండలిలో ప్రతిపక్షం ఉందని చిక్కాల పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పాత్ర మండలిలో ఎప్పుడూ నామమాత్రమేనని, టీచర్ ఎమ్మెల్సీలే ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించేవారని చిక్కాల చెప్పారు. ఈసారి వైసీపీ అసెంబ్లీని బహిష్కరించడంతో మండలి సమావేశాలు ఆసక్తికరంగా మారతాయని చిక్కాల అభిప్రాయపడ్డారు.

మంత్రిగా లోకేష్ తొలి ప్రసంగం

మంత్రిగా లోకేష్ అసెంబ్లీలో తొలిసారి ఈ సమావేశాల్లోనే పెదవి విప్పారు. గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (ప్రస్తుత శాసనసభ 9వ సెషన్స్) ముగిశాక కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మే నెలలో అదే సెషన్స్ రెండో సమావేశాన్ని కేవలం జీఎస్టీ బిల్లు ఆమోదంకోసం నిర్వహించారు. అప్పుడు ఇతర అంశాలపై చర్చ జరగకపోవడంవల్ల మంత్రులకూ మాట్లాడే అవకాశం రాలేదు. ఇప్పుడు విపక్షం లేని విచిత్ర పరిస్థితుల్లో ప్రారంభమైన 14వ శాసనసభ 10వ సెషన్ కొన్ని విశేషాలకు వేదికవుతోంది. శుక్రవారం గువాహతిలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వెళ్ళకుండా అసెంబ్లీ సమావేశాల్లోనే పాల్గొన్నారు ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Next Post

25 వరకు అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 25వ తేదీవరకు నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. […]
error

Enjoy this blog? Please spread the word