కేంద్రానికి టీడీపీ, రాష్ట్రానికి బీజేపీ టాటా… తక్షణమే రాజీనామాల ఆమోదం

admin
6 0

కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న అశోకగజపతిరాజు, సుజనా చౌదరి

చంద్రబాబు ఆదేశంతో ప్రధాని మోదీని కలసి రాజీనామా లేఖలు అందించిన నేతలు

కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నా ఎన్డీయేలో కొనసాగుతున్నట్టు వెల్లడి

అంతకు ముందే రాష్ట్ర మంత్రివర్గానికి గుడ్ బై చెప్పిన కామినేని, మాణిక్యాల రావు

రాజీనామాల తర్వాత ముఖ్యమంత్రిని ప్రశంసించిన మాజీ మంత్రులు

తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య పెరిగిన దూరం ఒకేసారి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మంత్రుల రాజీనామాలకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీయే 2 ప్రభుత్వంలో భాగస్వాములైన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా (వైఎస్) చౌదరి గురువారం రాత్రి తమ రాజీనామా లేఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రాజీనామాలు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులను బుధవారం రాత్రే ఆదేశించారు. అయితే, కేంద్ర మంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా చేసే లోపే రాష్ట్రంలో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు గుడ్ బై చెప్పారు.

టీడీపీ కేంద్రంనుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... వెంటనే రాష్ట్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని వారిద్దరినీ ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఆ నిర్ణయం కొద్ది గంటల్లోనే అమల్లోకి వచ్చింది. గురువారం ఉదయం అసెంబ్లీలో అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసిన కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను అందజేశారు. అయితే ఢిల్లీలో పార్లమెంటు జరుగుతున్నప్పటికీ అశోక గజపతిరాజు, వైఎస్ చౌదరిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శనభాగ్యం వెంటనే లభించలేదు. గురువారం రాత్రి ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళి ముందే సిద్ధం చేసుకున్నరాజీనామా లేఖలను అశోక గజపతిరాజు, వైఎస్ చౌదరి స్వయంగా సమర్పించారు.

ఇంటికి చేరేలోపే ఆమోదం

కేంద్రం నుంచి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానికి రాజీనామా లేఖలను సమర్పించడానికి సుమారు 24 గంటలు సమయం పట్టింది. అయితే, వారి రాజీనామాలు ఆమోదం పొందడానికి అరగంట కూడా పట్టలేదు. మంత్రులు రాజీనామా పత్రాలు సమర్పించి విలేకరులతో మాట్లాడి ఇళ్ళకు చేరేలోపు రాష్ట్రపతికి పంపడం, ఆమోదించడం శరవేగంగా జరిగిపోయాయి. ఆమోద సమాచారం అమరావతి వరకు చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో బీజేపీ మంత్రుల రాజీనామాలు కూడా ఆమోదం పొందినట్టు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతానికి ఎన్డీయేలోనే టీడీపీ

అక్కడ కేంద్రంలో టీడీపీ నేతలు, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నేతలు మంత్రివర్గాలనుంచి వైదొలగినా రెండు పార్టీలూ ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వాములుగానే కొనసాగుతున్నాయి. తాము ఎన్డీయేలో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్న అశోక్, సుజనా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదని, దీంతో ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో సెంటిమెంట్ గా మారిందని సుజనా చౌదరి పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశం మేరకు తాము రాజీనామా చేసినట్టు ఇద్దరూ చెప్పారు. ఎన్డీయే నుంచి పార్టీపరంగా వైదొలిగే విషయమై తమ అధినేత నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. ప్రధానిని కలసి రాజీనామాలను సమర్పించిన అనంతరం అశోక్, సుజనా తమ సహచర ఎంపీలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజీనామా చేయడానికి వెళ్లే సమయంలోనే అధికారిక వాహనాలను వదిలేసి సొంత వాహనాలను వినియోగించారు.

చంద్రబాబును ప్రశంసించిన బీజేపీ మంత్రులు (తాజా మాజీలు)

ఇటు రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న బీజేపీ నేతలు అసెంబ్లీలో మాట్లాడి ఘనంగా వీడ్కోలు తీసుకున్నారు. అయితే, ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు. పైగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపడంతోపాటు ఆయన పని తీరును కొనియాడారు. కామినేని శ్రీనివాస్ సహజంగానే కొంత ఎక్కువ ప్రశంసలు కురిపించారు. మాణిక్యాలరావు కూడా ఎక్కడా విమర్శ ధ్వనించకుండా ప్రశంసలతో సరిపెట్టారు. ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోకపోవడంతో బీజేపీ నేతలు సానుకూలంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజీనామాలకు ముందు బీజేపీ మంత్రులను గంటా శ్రీనివాసరావు వంటి సహచర మంత్రివర్గ సభ్యులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. స్థూలంగా ఓ నిరసన చర్యకు ప్రతిచర్య కూడా సుహృద్భావ వాతావరణంలోనే ముగిసింది. 

Next Post

హోదా నిరాకరణ ఎందుకు? కేంద్రాన్ని ప్రశ్నించిన ఏపీ అసెంబ్లీ

కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న అశోకగజపతిరాజు, సుజనా చౌదరి చంద్రబాబు ఆదేశంతో ప్రధాని మోదీని కలసి రాజీనామా లేఖలు అందించిన […]
error

Enjoy this blog? Please spread the word