తెలుగుదేశం పార్టీకి అత్యంత సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గం ఏది? అంటే అంతా టక్కున చెప్పే సమాధానం ‘అద్దంకి’. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనుంచి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వచ్చి చేరిన తర్వాత అధినేత చంద్రబాబుకు సైతం అద్దంకి పెద్ద తలనొప్పిగా మారింది. ముఠా రాజకీయాల్లో ఆరితేరిన ప్రత్యర్ధులు కావడంతో పార్టీ వేదికలపైన కలసి కూర్చునే పరిస్థితి లేదు. కలసి కార్యక్రమాలు చేపట్టే అవకాశమే లేదు. దీంతో... సీనియర్ నేత కరణం బలరాంకు ఎమ్మెల్సీ సీటు కేటాయించి అద్దంకి బరినుంచి తప్పించారు అధినేత చంద్రబాబు. అయినా పోరు ఆగడంలేదు.
అద్దంకిని పూర్తిగా వదులుకోవడానికి బలరాం సిద్ధంగా లేరు. కొత్తగా వచ్చాంగదా..సర్దుకుపోదామన్న ధోరణి రవిలోనూ కనిపించదు. మరోవైపు.. ఇటీవల వేమవరం గ్రామంలో బలరాం వర్గీయుల జంట హత్యలు కలకలం రేపాయి. ఇంకేముంది.. ఈ మంట మరింత పెరిగింది. గురువారం ఏకంగా రాష్ట్ర సచివాలయానికే ఈ సెగ తగిలింది. ప్రకాశం జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలోనే ఈ ఇద్దరు నేతలూ కొట్టుకోబోయారు. జిల్లా మంత్రి శిద్ధా రాఘవరావు ఛాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి పౌరసరఫరాల మంత్రి, బాపట్ల లోక్ సభా నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల సునీత కూడా హాజరయ్యారు.
12 అంశాల ఎజెండాతో ప్రారంభమైన సమావేశం ఆదిలోనే వివాదంతో వేడెక్కింది. మార్టూరు మార్కెట్ కమిటీ నియామకం విషయంలో మాటా మాటా పెరిగింది. ఆ కమిటీ నియామకం విషయం తనకు వదిలేయాలని రవి కోరిన సమయంలో బలరాం జోక్యం చేసుకున్నట్టు సమాచారం. బయటినుంచి వచ్చినవారు పెత్తనం చేస్తున్నారని బలరాం వ్యాఖ్యానించారు. గతంలో నియామకానికి అడ్డుపడ్డారని బలరాం ఆరోపించడంతో ఊరికే తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని రవి రెట్టించినట్టు సమాచారం. ఈ సమయంలో బలరాం, రవి లేచి నిల్చొని ఒకరివైపు మరొకరు దూసుకెళ్తుండటంతో ఇతర ఎమ్మెల్యేలు బలవంతంగా ఆపవలసి వచ్చింది.
ఒకరు చూసుకుందాం రమ్మంటే మరొకరు కుర్చీ ఎత్తారు. మిగిలిన నేతలు వారిద్దరూ కొట్టుకోకుండా ఆపగలిగారు. ఈ ఘర్షణ జరిగే సమయానికి ఇంకా సమావేశానికి రాని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి. నారాయణ విషయం తెలిసాక ఉరుకులు పరుగులపై వచ్చారు.