అత్యంత ఖరీదైన తైవాన్ పుట్ట గొడుగులు
ఒక్కటి రూ. 80,000 మాత్రమే..
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాషన్ ప్రియుడు. ఆయనకు డిజైనర్ దుస్తుల మోజు ఎక్కువన్న విషయం చాలా మందికి తెలిసిందే. గడ్డం ట్రిమ్మింగ్ నుంచి అన్నింటా రిచ్ లుక్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు. మోదీ వంటి ఛాయ కాస్త తెల్లగా మారడం వెనుక మహా ఖరీదైన కారణమే ఉందట. మోదీ తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పుట్ట గొడుగులు తింటారట. వాటి ఖరీదు వింటేనే కళ్ళు తిరుగుతాయి. ఒక్కొక్క పీస్ ఖరీదు రూ. 80,000 ఉంటుందని ఠాకూర్ చెబుతున్నారు.
నాకు ఒకరు చెప్పారు.. మోదీ తినే తిండి మీరు తినలేరు అని. ఎందుకంటే అది పేదవాళ్ళ ఆహారం కాదు - అల్పేష్ ఠాకూర్.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఠాకూర్ మంగళవారం వాడ్ గావోన్ సభలో మాట్లాడారు. మోదీ తినే పుట్ట గొడుగులు తైవాన్ నుంచి వస్తాయని తనకు ఒకరు చెప్పారన్న ఠాకూర్ "ఒక్కొక్క పుట్ట గొడుగు ధర రూ. 80,000. అవి రోజుకు ఐదు తింటారు. అందుకే ఆయన రంగు మారింది. గతంలో ఆయన నా అంత నల్లగా ఉండేవారు. మారడం నాకు ఆశ్చర్యం అనిపించింది" అని పేర్కొన్నారు. మోదీ తైవాన్ పుట్ట గొడుగులు తింటారని చెప్పిన ఆ వ్యక్తే... 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అవి తీసుకుంటున్నట్టు వెల్లడించాడట.
"ప్రధాన మంత్రి నెలకు రూ. 1.20 కోట్ల విలువైన పుట్ట గొడుగులు తింటున్నారు. ఆయన వద్ద పని చేసేవారు ఎంత డబ్బు తింటున్నారో మీరే ఊహించుకోండి" అని అల్పేష్ ఠాకూర్ గుజరాత్ ప్రజలకు సూచించారు. గుజరాత్ ఎన్నికల్లో గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీకి అధిపతి అయిన ప్రధాని వరకు దిగజారి ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. ఆ విడ్డూర ఆరోపణల్లో ఇదీ ఒక భాగమో.. లేక ఠాకూర్ చెప్పింది నిజమో ప్రస్తుతం నిర్ధారించలేం. భవిష్యత్తులో తేలుతుందేమో చూడాలి.
22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ కుర్చీని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా, ఎలాంటి ఆరోపణలకైనా వెనుకాడటంలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్తగా అంది వచ్చిన కుల ఉద్యమ నాయకులతో కలిసి ఈసారైనా అధికారాన్ని అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అలా కాంగ్రెస్ పార్టీకి చేయి అందించిన వారిలో అల్పేష్ ఠాకూర్ ఒకరు.