-
2018 చివరికల్లా ఆధార్ ఎంట్రీ, బయో మెట్రిక్ బోర్డింగ్..
-
ప్రతి పాయింట్లో పేపర్ టికెట్ చూపక్కర్లేదు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ) దేశంలోనే తొలి ఆధార్ అనుసంధానిత విమానాశ్రయంగా రికార్డులకు ఎక్కనుంది. ఆధార్ నెంబర్ తో ఎంట్రీ, బయో మెట్రిక్ బోర్డింగ్ వ్యవస్థ 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా అమలు కానున్నాయి. కియాను పూర్తి స్థాయి స్మార్ట్ ఎయిర్ పోర్టుగా మార్చే ప్రయత్నంలో ఇది మరో అడుగుగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (బిఐఎఎల్) పేర్కొంది. ప్రయాణికుల ఐడెంటిటీ-వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ మార్పు దోహదపడుతుందని ఆ సంస్థ భావిస్తోంది.
ఆధార్ అనుసంధానం వల్ల ప్రతి చెక్ పాయింట్ వద్ద కేవలం ఐదు సెకండ్లలో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు. సాధారణంగా 25 నిమిషాలు పట్టే స్క్రీనింగ్ ప్రక్రియను నూతన విధానంలో 10 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. దీనివల్ల ఒక్క గేటునుంచే ఎక్కువ మంది ప్రయాణీకులు వెళ్ళడానికి సమయం ఉంటుంది. ప్రయాణీకులకు వేచి చూసే సమయం తగ్గుతుంది. పేపర్ టికెట్/బోర్డింగ్ పాస్, ఐడి ప్రతీ పాయింట్ లోనూ చూపించనక్కర్లేదు. ఒకే ట్రావెల్ డాక్యుమెంట్, ఐడెంటిటీ డాక్యుమెంట్ తో పని అవుతుంది.
మరోవైపు ఎయిర్ లైన్స్, సెక్యూరిటీ విభాగాలకూ పని సులువవుతుంది. ప్రయాణీకుల లొకేషన్ తెలుసుకోవడం, రియల్ టైమ్ బిజినెస్ ఇంటలిజెన్స్ వల్ల ఎయిర్ లైన్స్ కు ఖర్చు తగ్గుతుంది. సెక్యూరిటీ మెరుగవడంతోపాటు భవిష్యత్తుకోసం ప్రయాణీకుల ప్రొఫైల్ తయారు చేసే వీలుంటుంది.
బిఐఎఎల్ జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ ఎఫ్ పి) ప్రకారం నూతన విధానం అమలుకు 325 రోజుల డెడ్ లైన్ ఉంది. ఎయిర్ పోర్టు ఎంట్రీకి సంబంధించి ప్రాజెక్టు అమలు 2018 మార్చిలో మొదలవుతుంది. మరో 90 రోజుల్లో అన్ని దేశీయ విమాన సర్వీసులూ ఫేజ్2ను అమలు చేయాల్సి ఉంటుంది. వచ్చే అక్టోబర్ 4వ తేదీనాటికి అంతర్జాతీయ విమాన సర్వీసులకూ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. 2018 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలవుతుంది.