తెలుగు తెర రారాణి అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి సినిమా ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టే అనుష్క ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఓ చేతిలో మేకు దిగి గోడకు శిలువ వేసినట్టున్న అనుష్క లుక్ భాగమతి కథపై ఆసక్తిని రేపేలా ఉంది. ఎడమ చేతిలో మేకు దిగి ఉండటం చూసి.. భాగమతికి శిలువ వేశారా అనుకునేలోపు తన కుడి చేతిలోనే సుత్తిని గమనిస్తాం. ఏమైంది? ఒక చేతిలో మేకు.. మరో చేతిలో సుత్తి.. ఏమిటో కథ?!
రాణిరుద్రమగా మెప్పించిన అనుష్క థ్రిల్లర్ మూవీ అరుంధతిలోనూ అలరించింది. బాహుబలిలో దేవసేనగా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక భాగమతిగా ఎలా ఉంటుందో.. అని అభిమానులు ఎదురు చూస్తున్నతరుణంలో ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలకు తగ్గట్టే ఉంది. ఆశ్చర్యకరంగా అనిపించే విషయం.. అనుష్క బాగా నాజూగ్గా కనిపించడం! బాహుబలిలో బొద్దుగా కనిపించిన అనుష్క.. మధ్యలో జీరో సైజు కోసం ప్లస్ సైజుకు పెరిగింది. భాగమతికోసం మరోసారి తనను తాను శిల్పంలా మలుచుకుంది.
అనుష్క షెట్టి పుట్టిన రోజు (నవంబర్ 7) సందర్భంగా ఫస్ట్ లుక్ వెలువడుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి (జనవరి 12న) విడుదల చేయాలని నిర్ణయించిన ఈ థ్రిల్లర్ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సోమవారం తెలుగుతోపాటు తమిళ, మళయాళ భాషల్లో కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.