వ్యాపార సరళీకరణలో 100వ ర్యాంకు

2 0
Read Time:6 Minute, 21 Second

‘పన్నుల చెల్లింపు’ కేటగిరిలో బిగ్ జంప్
దివాళా కంపెనీలపై మార్గదర్శకాలూ మేలు చేశాయి
మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల్లో బెస్ట్ రేటింగ్
గతంకంటే దిగజారిన అంశాలూ ఉన్నాయి
ఆస్తి రిజిస్ట్రేషన్ మరింత వరస్ట్
ఇప్పటికీ 99 దేశాలు మనకంటే ముందు

రెండేళ్ళ ఎదురు చూపుల తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకులలో ఇండియా ముందుకొచ్చింది. 2018 సంవత్సరంకోసం ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో ఇండియా 100వ ర్యాంకును సాధించింది. మొత్తం 190 ఆర్థిక వ్యవస్థలను పరిశీలించి ర్యాంకులు ఇవ్వగా…ఇండియా 2017లో కంటే 30 స్థానాలు జంప్ చేసి 100కు చేరుకుంది.

పన్ను చెల్లింపులు, దివాళా పిటిషన్ల పరిష్కారం, మైనారిటీ ఇన్వెెస్టర్లకు రక్షణ వంటి విషయాల్లో గతంకంటే బాగా మెరుగుపడినట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పన్ను సంస్కరణలు, జారీ చేసిన దివాళా కంపెనీల మార్గదర్శకాలు ప్రధానంగా ఈ మెరుగుదలకు కారణాలుగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2017 రిపోర్టు ప్రకారం మైనారిటీ ఇన్వెస్టర్లకు భద్రతలో ఇండియా ర్యాంకు 13. కాగా అది 2018 రిపోర్టు ప్రకారం బాగా మెరుగుపడి 4కు చేరింది. ఈ విషయంలో మాత్రమే ఇండియా 10 లోపు ర్యాంకు సాధించింది.

పన్నుల చెల్లింపు కేటగిరిలో172వ స్థానం నుంచి 119కి, దివాళా పరిష్కారాల విషయంలో 136వ స్థానంనుంచి 103కు, రుణం పొందే విషయంలో 44 నుంచి 29కి మెరుగుపడింది. అదే సమయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో ఇండియా ర్యాంకు 138 నుంచి 154కు దిగజారింది. మిగిలిన విషయాల్లో దాదాపు సమానంగానో లేక కొద్దిగా దిగజారడమో కనిపిస్తుంది. 2017 రిపోర్టు ప్రకారం ఇండియా వ్యాాపార ప్రారంభం విషయంలో 155వ ర్యాంకులో ఉంటే 2018 రిపోర్టు ప్రకారం 156వ ర్యాంకుకు తగ్గింది. విద్యుత్ పొందే అంశంలో ర్యాంకు 26 నుంచి 29కి చేరితే.. సరిహద్దులకు అవతల వాణిజ్యంలో 143 నుంచి 146వ ర్యాంకుకు పడిపోయింది.

గత ఏడాదితో పోలిక లేకుండా ఉత్తమ, చెత్త ర్యాంకులను పరిశీలిస్తే… నిర్మాణ పర్మిట్ల విషయంలో ఇండియా వరస్ట్ స్థితిలో ఉంది. 190 ఆర్థిక వ్యవస్థల్లో మన స్థానం 181. వ్యాపార ప్రారంభం విషయంలో 156. కాంట్రాక్టుల అమలు విషయంలో 164. ఓవరాల్ ర్యాంకు ఒకే ఏడాదిలో 30 స్థానాలు పెరగడం విశేషమే అయినా… పన్నుల చెల్లింపు సరళతరం సహా కొన్ని విషయాల్లో వాస్తవిక పరిస్థితిని ఈ నివేదిక ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయం మరో వైపు వ్యక్తమవుతోంది.

సాధించిన ఫలితానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం పండగ చేసుకుంటోంది. ప్రభుత్వ పెద్దలకు పరిశ్రమ వర్గాలు ప్రశంశలు కురిపిస్తున్నాయి. 2016 నివేదికతో పోలిస్తే 2017 ర్యాంకు మెరుగుపడనందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిరాశపడింది. చేపట్టిన సంస్కరణలు ఈవోడీబీ నివేదికలో ప్రతిఫలించలేదని నివేదిక రూపకర్తలను ఆక్షేపించడానికీ వెనుకాడలేదు. అదే ప్రభుత్వం ఇప్పుడు.. ఒకే ఏడాది 30 ర్యాంకులు మెరుగుపడటం రికార్డుగా ప్రచారం చేస్తోంది. గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమంటే ఇంకా 99 దేశాలు మనకంటే ముందున్నాయి.

చైనా ఈసారి ర్యాంకును మెరుగుపరుచుకోలేదు. కానీ, ఇప్పటికీ 78వ ర్యాంకుతో మనకంటే 22 స్థానాలు ముందుంది. దక్షిణాసియాలో చిన్న దేశం భూాటాన్ మనకంటే చాలా మెరుగ్గా 75వ స్థానంలో ఉంది. మిగిలిన దేశాలు వెనుకే ఉన్నాయి.

టాప్ 10 దేశాలివి

2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికలో న్యూజీలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్ రెండో ర్యాంకును కైవశం చేసుకోగా డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్, అమెరికా, యుకె, నార్వే, జార్జియా, స్వీడన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ర్యాంకును గతంకంటే బాగా మెరుగు పరుచుకునే విషయంలో టాప్ 10లో బ్రూనై వరుసగా రెండోసారి కూడా సత్తా చాటింది. తర్వాత థాయ్ లాండ్, మలావి, కొసావో, ఇండియా, ఉజ్బెకిస్తాన్, జాంబియా, నైజీరియా, డిజిబౌతి, ఎల్ సాల్వెడార్ ఉన్నాయి.

ప్రపంచ బ్యాంకు 15 సంవత్సరాలుగా డూయింగ్ బిజినెస్ నివేదికలు వెల్లడిస్తోంది. ఈ 15 సంవత్సరాలుగా చూస్తే ర్వాండా అత్యధికంగా వాణిజ్య సంస్కరణలను అమలు చేసినట్టు తేలింది. ఆ దేశం 52 సంస్కరణలను చేపట్టగా 47 సంస్కరణలతో జార్జియా రెండో స్థానంలో నిలిచింది. జార్జియా టాప్ 10 లోకి కొత్తగా ఈ ఏడాదే వచ్చి చేరింది.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
100 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply