దేశాల జాతీయ ప్రభుత్వాలు కొత్త నగరాలను నిర్మించడమే అరుదు. ఇండియాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం.. విభజిత రాష్ట్రానికి రాజధానిగా నూతన నగరాాన్ని నిర్మించడానికి అష్టకష్టాలూ పడుతోంది. వ్యవస్థలకే కష్టంగా ఉన్న నూతన నగరాల నిర్మాణాన్ని వ్యక్తులు తలపెడితే… ! అది ఆశ్చర్యమే. అది అత్యంత అరుదైన విషయమని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇప్పుడదే జరగబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు బిల్ గేట్స్.. సొంతగా ఓ స్మార్ట్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఫీనిక్స్ నగరానికి పశ్చిమాన ఉన్న టోనొఫా అనే ప్రాంతంలో అధునాతన నగరాన్ని నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ అధినేత శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం బిల్ గేట్స్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ బెల్మాంట్ పార్టనర్స్ ఆ ప్రాంతంలో ఏకంగా 25,000 ఎకరాల భూమిని సేకరించింది. భూమి కొనుగోలుకు ఈ కంపెనీ సుమారు 80 మిలియన్ డాలర్లు (సుమారు 520 కోట్ల రూపాయలు) వెచ్చించింది. అంటే.. ఎకరానికి సుమారు రూ. 20.80 లక్షలు.
బిల్ గేట్స్ నిర్మించబోయే నగరం పేరు కూడా ‘బెల్మాంట్’ అని ప్రాథమిక సమాచారం. ఇక ఆ నగరం ఎలా ఉంటుందంటే.. అంతా ఆధునిమే..అక్కడంతా భవిష్య దర్శనమే!! ఒక్క మాటలో చెప్పాలంటే సిలికాన్ వ్యాలీ వెలుపల ఒక హైటెక్ నగరం. కేలిఫోర్నియాను ఆనుకొని ఉన్నా అరిజోనా ఈ విషయంలో వెనుకబడి ఉంది. వినూత్న సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా భావించే కంపెనీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు అరిజోనాలో స్మార్ట్ సిటీని నిర్మించాలన్న బిల్ గేట్స్ నిర్ణయంతో ఆ కల నెరవేరుతుందని భావిస్తున్నారు.
ఫ్యూచర్ టెక్ నగరం…
ఇప్పుడు అమెరికా అంతటా ’బెల్మాంట్’పై చర్చ సాగుతోంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, హైస్పీడ్ డిజిటల్ నెట్ వర్క్, డేటా సెంటర్లు, తయారీ రంగంలో నూతన టెక్నాలజీ, డ్రైవర్ లెస్ వాహనాలు, మానవ రహిత లాజిస్టిక్ హబ్స్… ఇలా నగరమంతా ఆధునికత ఉట్టిపడుతుందట! అరిజోనా టెక్నాలజీ కౌన్సిల్ ప్రతినిధి రొనాల్డ్ స్కాట్ ఈ విషయమై మాట్లాడుతూ.. బిల్ గేట్స్ ఎంచుకున్న ప్రదేశం నూతన నగరానికి సరైనదని అభిప్రాయపడ్డారు. లాస్ వెగాస్ నగరాన్ని అనుసంధానించేలా ప్రతిపాదించిన రహదారి ఈ నూతన నగరం మధ్యనుంచి పోతుందని ఆయన చెప్పారు. అంటే, పక్కా విజన్ తోనే బిల్ గేట్స్ సరికొత్త సాంకేతిక నగరానికి ప్రతిపాదనలు రూపొందించారన్నమాట.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పాతిక వేల ఎకరాల్లో నిర్మించే ’బెల్మాంట్’ నగరంలో 3,800 ఎకరాలను కార్యాలయాలు, వాణిజ్య, రిటైల్ కార్యకలాపాలకు కేటాయిస్తారు. మరో 470 ఎకరాలను పబ్లిక్ స్కూళ్ళకు కేటాయిస్తారు. అక్కడ సుమారు 80 వేల ఇళ్ళను నిర్మించాలన్నది ప్రణాళిక. మిగిలిన వివరాలు బయటకు రాలేదు. బిల్ గేట్స్ స్మార్ట్ నగర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఇంకా వెల్లడి కావలసి ఉంది.