బీజేపీ కంచుకోటకు బీటలు.. గురుదాస్ పూర్ ఉప ఎన్నికలో ఘోర ఓటమి

1 0
Read Time:5 Minute, 1 Second
1.93 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం..

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-బిజెపి కూటమిని ఓడించిన పంజాబ్ ప్రజలు తాజాగా కమలం పార్టీకి ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బిజెపి చిత్తుగా ఓడిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సునీల్ జాఖర్ బిజెపి అభ్యర్ధి స్వరణ్ సలేరియాపై ఏకంగా 1,93,219 ఓట్లతో విజయం సాధించారు. గురుదాస్ పూర్ బిజెపి సిటింగ్ సీటు. ఆ పార్టీ ఎంపీ, సినీ నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన సీటు. ఇప్పుడది చేజారిపోవడం.. అందునా ఇంత భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందడంతో బీజేపీ కంగుతింది.

బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా ఈ ఏడాది ఏప్రిల్ 27న మరణించారు. దీంతో గురుదాస్ పూర్ లోక్ సభ స్థానానికి ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. 2014లో 70 శాతం పైగా పోలింగ్ నమోదైన ఈ స్థానంలో 2017 ఉప ఎన్నిక సందర్భంగా మాత్రం 56 శాతమే జరిగింది. గురుదాస్ పూర్ లోక్ సభ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అన్నిచోట్లా పోలింగ్ తగ్గింది. ఇంత తక్కువ పోలింగ్ జరిగినా కాంగ్రెస్ మెజారిటీ భారీగా ఉండటం గమనార్హం.

గురుదాస్ పూర్ కోసం త్రిముఖ పోటీ జరిగింది. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ, కొత్తగా ఆ స్థానాన్ని కైవశం చేసుకోవడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నించాయి. పోలింగ్, కౌంటింగ్ సందర్భాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ రెండుచోట్ల జరిగింది.

కోల్పోయింది కంచుకోటనే…

గురుదాస్ పూర్ బీజేపీకి చాలా కీలకమైన స్థానం. ఆ పార్టీ తరఫున వినోద్ ఖన్నా అక్కడ నాలుగుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సుమారు లక్షా 35 వేల ఓట్ల తేడాతో ఖన్నా గెలుపొందారు. ఆయన చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలో మాత్రం బీజేపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఒక ఎంపీ చనిపోయినప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి జరిగే ఎన్నికలో ఎంతో కొంత సానుభూతి పని చేయడం కద్దు. అయితే, ఇక్కడ అదేమీ బీజేపీని గట్టెక్కించలేకపోయింది. బీజేపీ-అకాలీదళ్ కూటమికి తిరస్కారమే ఎదురైంది. బీజేపీ అభ్యర్ధి చాలా దూరంలో రెండో స్థానంతో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడో స్థానానికి పరిమితమైంది.

ఆర్నెల్ల క్రితం రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పోరులా గురుదాస్ పూర్ ఉప ఎన్నిక ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్ధి అయితే.. గురుదాస్ పూర్ ఎన్నికను మోదీ పాలనపై రిఫరెండంగా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఈ పార్లమెంటు స్థానం పరిధిలో నాలుగు సెగ్మెంట్లలో పోటీ చేసి ఒక్కటి మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో వినోద్ ఖన్నా సీటు పదిలంగా కాపాడుకుంటే రాష్ట్రంలో పాార్టీకి మంచి ఊపునిస్తుందని ఆ పార్టీ ఆశించింది.

భారీ మెజారిటీతో గురుదాస్ పూర్ దక్కడం కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ ఫలితం బిజెపి-అకాలీదళ్ కూటమికి ’టోటల్ రిజెక్షన్’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించగా… ప్రజలు ఇచ్చిన దీపావళి బహుమతిగా నవజోత్ సింగ్ సిద్ధూ అభివర్ణించారు.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply