ప్రభుత్వ శాఖల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ

ఈ రంగంలో పెట్టుబడులకోసం ప్రయత్నం..
ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీలో విశాఖ బ్రాండ్ కోసం నెలనెలా ఈవెంట్లు 

మొన్నా మధ్య ’వన్నా క్రై’ చాలామందిని ఏడిపించింది. పెద్ద సంఖ్యలో దేశాల ప్రభుత్వ, ప్రైవేటు కంప్యూటర్ వ్యవస్థల్లోకి చొచ్చుకొని పోయిందీ వైరస్. సమాచార సాంకేతిక పరిజ్నానం వాడకం పెరిగేకొద్దీ ఇలాంటి సైబర్ దాడులకూ అవకాశాలు కోకొల్లలు. మన రాష్ట్రంలో ఇలాంటి దాడులకు గురి అయిన ఉదంతాలు తక్కువేగానీ, ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కొన్ని చర్యలను చేపడుతోంది. అందులో భాగమే… ప్రభుత్వ శాఖల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగం.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫిన్ టెక్ పై చర్చించారు. సైబర్ దాడులను తట్టుకునేలా ప్రభుత్వ శాఖల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు ఐటి శాఖ అధికారులు ఈ సందర్భంగా మంత్రికి చెప్పారు. ఇందుకోసం ఐదు స్టార్టప్ కంపెనీలతో కలసి పని చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

బ్లాక్ చైన్ వాణిజ్య సదస్సు సందర్భంగా జరిగిన చర్చల్లో… ఆంధ్రప్రదేశ్ లో పెట్టబడులు పెట్టడానికి అంగీకరించిన కంపెనీలతో మళ్ళీ మాట్లాడాలని అధికారులకు లోకేష్ చెప్పారు. అవసరమైతే కంపెనీలను ఆహ్వానించడానికి తానే వెళ్తానని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఫిన్ టెక్ వ్యాలీ అభివృద్ధిపై లోకేష్ ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. ఆర్థిక సేవల రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏం చేయాలన్న అంశంపై ఈ సందర్భంగా చర్చించారు.

విశాఖపట్నం ఫిన్ టెక్ వ్యాలీకి బ్రాండింగ్ కోసం ప్రతి నెలా ఫిన్ టెక్- బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈవెంట్లను నిర్వహించాలని లోకేష్ అధికారులకు సూచించారు. విశాఖ వ్యాలీలో పేటీఎం, అంజుర్, వాల్యూ ల్యాబ్స్, ఐడిఎ వంటి కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయని, వాటిలో 574 మంది పని చేస్తున్నారని అధికారులు చెప్పారు. అయితే, ఫిన్ టెక్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసిన మరో 17 కంపెనీలతో చర్చలు జరిపి వీలైనంత త్వరగా రాష్ట్రానికి వచ్చేలా కార్యాచరణను రూపొందించాలని లోకేష్ ఆదేశించారు.

వీసా ప్రారంభించిన ’లెస్ క్యాష్ వైజాగ్’కు మంచి స్పందన వచ్చిందని, ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న మాస్టర్ కార్డ్ కంపెనీ కూడా వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 20 మంది భాగస్వాములతో కలసి 100కు పైగా రంగాలలో ఫిన్ టెక్ వినియోగంపై కేస్ స్టడీస్ చేస్తామని అధికారులు చెప్పారు.

ఫిన్ టెక్ పెట్టుబడులకోసం జపాన్, సింగపూర్, లండన్

ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలులో ముందున్న జపాన్, సింగపూర్, లండన్ లలో రోడ్ షోలు నిర్వహించి పెట్టబడులను ఆకర్షించాలని, అంతర్జాతీయ ఫిన్ టెక్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అక్కడి ప్రభుత్వాలతోనూ చర్చించి వారిని భాగస్వాములను చేసేందుకు అవసరమైన మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని లోకేష్ తన శాఖ అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సాహించేందుకు రూ. 100 కోట్ల నిధులు ఉన్నాయని, ఈ కార్యకలాపాల్లో పెట్టబడులు పెట్టేందుకు ఎస్ బిఐ, ఐసిఐసిఐ సుముఖత వ్యక్తం చేశాయని లోకేష్ చెప్పారు. వారితో చర్చలు జరిపి స్టార్టప్ కార్యక్రమం వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

Leave a Comment