ఇక టీడీపీ తరపునే పోటీ : బుట్టా రేణుక

0 0
Read Time:4 Minute, 4 Second
ముఖ్యమంత్రిని కలసిన కర్నూలు ఎంపీ
వైసీపీ సస్పెండ్ చేసినందున తానిప్పుడు ’స్వతంత్రం’ ఉన్నానని వ్యాఖ్య
తను చేరకుండా అనుచరుగణానికి టీడీపీ తీర్ధం

వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన రేణుక… ప్రస్తుతం టీడీపీకి దగ్గరయ్యారు. బుధవారం తన అనుచరగణంతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి తరలి వచ్చిన రేణుక ప్రభుత్వానికి మద్ధతు ప్రకటించారు. తాను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోకుండానే తనతో వచ్చిన నేతలకు టీడీపీ తీర్థం ఇప్పించారు.

బుట్టా రేణుక పార్టీ మారనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రిని కలసిన రేణుక… అభివృద్ధికోసం తాను ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రితో రేణుక చర్చించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఒక మాజీ ఎమ్మెల్యే సహా పలువురు నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. త్వరలో కర్నూలులో ఒక సభ ఏర్పాటు చేసి బుట్టా రేణుక అట్టహాసంగా టీడీపీలో చేరతారని ఆమె అనుయాయులు చెబుతున్నారు.

తాను టీడీపీలో చేరుతున్నట్టు ఎవరితోనూ చెప్పలేదంటూనే… భవిష్యత్తులో మాత్రం తెలుగుదేశం తరఫునే పోటీ అని రేణుక స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలసి అనుచరులకు టీడీపీ కండువాలు కప్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనేనని, అయితే.. ఆ పార్టీ తనను సస్పెండ్ చేసినందున ఇప్పుడు స్వతంత్రురాలిని అయినట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారడంపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ ’అంతటా కన్ఫ్యూజన్… అందరికీ కన్ఫ్యూజన్. నేను పార్టీ మారడానికి సిఎంని కలుస్తానని ఎవరికీ చెప్పలేదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్ధతుగానే కలిశాను’ అని రేణుక వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్ సభ సీటు ఇవ్వబోనని, దానికి బదులు ఎమ్మెల్యేగా పోటీ చేయవలసి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెప్పినందునే రేణుక పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్తలను ప్రస్తావించగా ఆమె ఖండించలేదు. 20 రోజులపాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిగాయని, ఇంకా ఒక కొలిక్కి రాలేదని రేణుక పేర్కొన్నారు.

కొసమెరుపు : తన విషయంలో అంతటా కన్ఫ్యూజన్ ఉందన్న రేణుక బుధవారం పరస్పరం భిన్నమైన సమాధానాలు చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ చేశారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply