నేడు ముఖ్యమంత్రితో భేటీ
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమైంది. మంగళవారం ఉదయం ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నారు. ఈ సందర్భంగానే ఆమె తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొనే అవకాశం ఉంది. ఆమెతోపాటు మాజీ ఎమ్మెల్యే ఒకరు, మరికొందరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.
2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక మొదటినుంచీ తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. పార్టీ మారతారని గతంలో ప్రచారం జరిగినప్పుడు జగన్ బుజ్జగించారు. ఆమె పార్టీ మారలేదు గాని… కాలక్రమంలో సొంత పార్టీ నుంచి అనుమానపు చూపులు ఎదుర్కొంటూ వచ్చారు.
ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా తమ పార్టీ ఎంపీని దూరం పెట్టారు. బుట్టా రేణుకను టీడీపీ కొనేసిందనే అర్ధం వచ్చేలా జగన్ సొంత పత్రిక సాక్షిలో కొద్ది రోజుల క్రితం వార్తా కథనాలు వచ్చాయి. ఈ కథనం తర్వాత రేణుక టీడీపీలో చేేరే అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే, మంగళవారం బుట్టా రేణుక ముఖ్యమంత్రిని కలసి టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాక… ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
బుట్టా రేణుక చేరికతో… ప్రతిపక్ష వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)నుంచి మరో దఫా వలసలు మొదలైనట్టేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో ఒకసారి మొదలైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికల పర్వం సుమారు 30 మందిని టీడీపీ దరి చేర్చింది. అందులో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలున్నారు.