మరో నర్మద అవుతుంది… పోలవరంపై చంద్రబాబు వ్యాఖ్య

6 0
Read Time:11 Minute, 23 Second
పనులు ఆపాలన్న కేంద్రం లేఖపై అసంతృప్తి 

లేనిపోని గందరగోళాన్ని రేపిందని వ్యాఖ్య
అసెంబ్లీలో లేఖను చదవి వినిపించిన సిఎం
టెండర్లు రద్దు చేయమంటే చేస్తాం
కేంద్రం నిర్మిస్తానంటే దండం పెట్టి వదిలేస్తాం
అసెంబ్లీ బయటా అదే అంశంపై చర్చ
ప్రభుత్వంలో భాగస్వాములైన బీజేపీ నేతలతోనూ అదే మాట

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్పిల్ వే పనులకు విడిగా టెండర్లను పిలిస్తే… ఆ ప్రక్రియను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ గందరగోళాన్ని రేపిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టు అయిన ‘పోలవరం’లో ప్రధాన కాంట్రాక్టరుతో నిమిత్తం లేకుండా స్పిల్ వే, స్పిల్ ఛానల్ లలో కొంత భాగానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖ మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. టెండర్ ప్రక్రియలోని సాంకేతికాంశాలను కూడా ఎత్తిచూపుతూ… కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలించేవరకు పనులు చేపట్టవద్దని ఆ లేఖలో కేంద్ర జలవనరుల శాఖ సూచించింది.

లేఖను గురువారం అసెంబ్లీలో చదివి వినిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇలాంటి ఆటంకాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో నర్మదా డ్యాం నిర్మాణానికి దశాబ్దాలు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం కూడా అలా అయితే రాష్ట్ర ప్రజలకే కాకుండా కేంద్రానికి కూడా నష్టమేనని హెచ్చరించారు. అసెంబ్లీ లోపల… పరిస్థితిని వివరించి ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, సమావేశాలు ముగిశాక ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంలో కేంద్రంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ ఆవరణలో బిజెపికి సంబంధించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కలసినప్పుడు కూడా చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తాజా లేఖపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడటానికి ప్రయత్నించానని, ఆయన విదేశాల్లో ఉన్నారని, వచ్చాక మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయమై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి తనతో మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ నేతల విమర్శలను కొట్టిపారేసిన సిఎం, ప్రాజెక్టు పురోగతిని అడ్డుకునేలా కేసులు వేయకుండా ఢిల్లీలో పోరాడాలని వారికి హితవు పలికారు. ప్రతిపక్ష వైసీపీ కలసి వస్తానంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళడానికి తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…
 • పోలవరాన్ని అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కొందరు కోర్టులకు, గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తే ఓవైపు వారిని ఎదుర్కొంటున్నాం. మరోవైపు ఆర్థిక ఇబ్బందులున్నాయి. రూ. 4000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశాం. ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడు తీసుకోవచ్చని..
 • కేంద్రంలో కొంతమంది అధికారులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న కేంద్రంనుంచి లెటర్ వచ్చింది. ఈ నెల 18వ తేదీన పిలిచిన టెండర్లపైన అభ్యంతరాలతో రాశారు.
 • పనులు నాలుగైదు నెలలు ఆగితే చాలా నష్టం జరుగుతుంది. గిరిజన గ్రామాల్లో రెండు లక్షల మందికి పునరావాసం కల్పించాలి. దాదాపు 98 వేల కుటుంబాలను ఆదుకోవాలి. ఇంకా 60 వేల ఎకరాలు సేకరించాలి. భూసేకరణ వేగవంతంగా చేయాలి.
 • మరోవైపు.. సంస్థలు, మెషినరీని మొబిలైజ్ చేయడం ఈజీ కాదు. చాలా సమయం పడుతుంది. మనం చాలా ప్రయతనాలు చేశాం. ప్రాజెక్టు స్థలంలో 4000మంది పని చేస్తున్నారు. 6 జాతీయ, అంతర్జాతీయ ఏజన్సీలు పని చేస్తున్నాయి. ఒకసారి పని ఆగితే వీరందరినీ సమకూర్చడానికి చాలా సమయం పడుతుంది.
 • నర్మదా డ్యాం చూడండి. 65 సంవత్సరాలు పట్టింది. పోలవరం కూడా ఎప్పుడో 1961లోనే ప్రతిపాదించారు. తర్వాత అంజయ్య సిఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది. 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఏడు మండలాలను తెలంగాణనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమైంది.
 • ప్రాజెక్టు కాంట్రాక్టర్ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారనే… 60 సి నిబంధన కింద కొన్ని పనులు వేరేవాళ్ళకు ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదని.. అధికారులందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నాం. దానికి అనుగుణంగానే స్పిల్ వే, స్పిల్ ఛానల్ లో కొంత భాగానికి టెండర్లు పిలిచాం.
 • ఈ సమయంలో కేంద్రం లేఖ వచ్చి లేనిపోని గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఇప్పటికి ప్రాజెక్టుపైన 12 వేల కోట్లు ఖర్చయింది. ఇంకో 42వేల కోట్లు అవసరం.
 • భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమానికి వ్యయం బాగా పెరిగింది. ఈ చట్ట మనం తేలేదు. అంతకు ముందు మూడు వేల కోట్లు ఉన్న ఈ వ్యయం.. కేంద్రం తెచ్చిన కొత్త (2013 భూసేకరణ) చట్టం కారణంగా  32 వేల కోట్లకు పెరిగింది. అంటే 10 రెట్లు.
 • పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల.  జీవనాడి. ఎన్ని ఇబ్బందులున్నా.. ఆటంకాలు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ధృఢ సంకల్పంతో పని చేస్తున్నాం.
 • ఇప్పుడు అందరూ ఒప్పుకొని.. సకాలంలో తామే ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే ఈరోజే వారికి అప్పగిస్తాం. ఎవరు పని చేసినా పోలవరం పూర్తి కావాలి.
మీడియాతో..
 • అసలు పోలవరం విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారో అర్ధం కావడంలేదు.
 • మిత్రపక్షం కాబట్టే మరింత సహనంతో వ్యవహరిస్తున్నా.
 • పోలవరం నిర్మాణాన్ని రాష్ట్రం చేపట్టాలని నీతి ఆయోగ్ చెప్పింది. మేముగా కోరుకున్నది కాదు.
 • పోలవరం టెండర్లను రద్దు చేయమంటే చేస్తా. ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తానంటే వదిలేసి ఓ నమస్కారం పెడతా.
 • ఆలస్యం జరగకూడదనే రాష్ట్ర ప్రభుత్వ సొంత డబ్బు ఖర్చు చేస్తోంది.
 • పట్టిసీమ ప్రాజెక్టు విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది లేకుంటే ఇప్పుడు తాగునీరు కూడా కష్టమయ్యేది.
 • పోలవరం రాష్ట్ర ప్రజల కల. అది పూర్తి కాకుంటే నష్టపోయేది ప్రజలు… కేంద్రం కూడా. పూర్తయితే రాష్ట్రం బాగుపడుతుందని మా ఆశ.
 • నేను ఆశావాదిని..నా పని నేను చేస్తా. కేంద్రం సహకరిస్తే సరి.. లేదంటే మనకష్టం మనకు మిగులుతుంది.
 • కాంగ్రెస్ సరిగ్గా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకొచ్చేది? భారంగా మారిన భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెసే కదా?
 • వాళ్ళు కేసులు వేయకుండా ఢిల్లీలో పోరాడితే బాగుంటుంది.
 • ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీల రాజీనామాలు ఏమయ్యాయి?
 • వాళ్లు సహకరిస్తామంటే డెలిగేషన్ గా ఢిల్లీ తీసుకెళ్తాం.
అది ఓ అధికారి లేఖ మాత్రమే

అసెంబ్లీ సమావేశాల తర్వాత బిజెపికి చెందిన మంత్రి కామినేని శ్రీనివాస్, శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి పోలవరం విషయమై చర్చించారు. జల వనరుల శాఖ అధికారి రాసిన లేఖను వారికి చూపించిన చంద్రబాబు… పోలవరంతోపాటు రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని బిజెపి నేతలు చంద్రబాబుకు చెప్పి సముదాయించే ప్రయత్నం చేశారు. 

ఆ తర్వాత బిజెపి నేతలు విలేకరులతో మాట్లాడుతూ జలవనరుల శాఖ లేఖపై ఆందోళన చెందనక్కర్లేదని, అది త్వరలో రిటైర్ కాబోయే ఓ అధికారి రాసినదని పేర్కొన్నారు . అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ క్రమంపై కేంద్రానికి అనుమానాలుంటే రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేసి ఉండవలసిందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply