ఇక ఉమ్మడి పర్యవేక్షణ…! పోలవరానికి 15 రోజులకోసారి గడ్కరీ

6 0
Read Time:8 Minute, 25 Second
పరిష్కారానికి వెళ్తే ప్రత్యక్ష జోక్యానికి పావులు కదిపిన కేంద్రం

ఇక రెండు వారాలకోసారి గడ్కరీ పోల‘వారం’..ఈ నెల 22తో శ్రీకారం

పోలవరం పనుల నత్తనడక, కాంట్రాక్టర్ మార్పు ప్రతిపాదన, కొత్త కాంట్రాక్టర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం తదితర విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు మరో మలుపు తీసుకున్నాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిర్మాణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇకపైన కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుందని మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వద్ద జరిగిన సమావేశంతో స్పష్టమైంది. పోలవరం ప్రాజెక్టు సందర్శన, ప్రగతి సమీక్షకోసం 15 రోజులకోసారి తానే స్వయంగా రాష్ట్రానికి వస్తానని గడ్కరీ ప్రకటించడం ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాష్ట్రం తరపున జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు, ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ హాజరయ్యారు.

స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో కొంత భాగాన్ని ప్రధాన కాంట్రాక్టర్ నుంచి విడదీసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలవడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ టెండర్ల ప్రక్రియను నిలిపివేయవలసిందిగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఆ టెండర్ల ప్రక్రియను కొనసాగించడానికే నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం లేఖలో పేర్కొన్న సాంకేతికాంశాలను మాత్రం పరిగణనలోకి తీసుకుంది. కేంద్రం లేఖపైన అసెంబ్లీలోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. గడ్కరీతో మాట్లాడటానికి సిఎం ప్రయత్నించినప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇండియాకు వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియా పర్యటనకు వెళ్లారు.ఈ సమయంలో ఏర్పాటైన సమావేశానికి మంత్రి ఉమ వెళ్లారు.

ఈ సమావేశం నేపథ్యంలో… కొరియానుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం గడ్కరీకి ఫోన్ చేసి మాట్లాడారు. పెండింగ్ నిధులలో రూ. 318 కోట్లు విడుదల చేస్తున్నట్టు గడ్కరీ ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతే గడ్కరీ  రాష్ట్ర ప్రతినిధులతో సమావేశానికి హాజరయ్యారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లపై గడ్కరీ ఎక్కడా కమిట్ కాలేదు. ఆ విషయంలో తనకు భిన్నాభిప్రాయం ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాతే మాట్లాడతానని బదులిచ్చారు.

అయితే, ఇతర ప్రాజెక్టు పనులేవీ ఆపవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను ఆపమన్నట్టుగా తమపై ప్రచారం జరిగిందని గడ్కరీత నవ్వుతూ వ్యాఖ్యానించారు. స్పిల్ వే, స్పిల్ చానల్ పనుల్లో కొంతభాగానికి రాష్ట్ర ప్రభుత్వం విడిగా టెండర్లు పిలవడంతో అయోమయం నెలకొని తాము పనులు నిలిపివేశామని సబ్ కాంట్రాక్టర్ త్రివేణి ప్రతినిధి చెప్పగా…దానికోసం మిగిలిన పని మొత్తం ఆపవలసిన అవసరం ఏముందని గడ్కరీ ప్రశ్నించారు. పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు హుకుం జారీ చేశారు.

డిసెంబర్ 22న తొలి పర్యటన

ఈ నెల 22వ తేదీన తాను పోలవరం సమీక్షకోసం వస్తానని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆ లోగా పనుల వేగం పెంచాలని స్పష్టం చేసిన గడ్కరీ.. పనులు సవ్యంగా చేయకపోతే ఏం చేయాలో తనకు తెలుసునని కూడా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా తాను ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నానని, ఇకపైన వాటితోపాటు పోలవరం కూడా ఒకటవుతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు.

ఇక అప్పటినుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నట్టే లెక్క. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ సంస్థల సాధారణ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన షెడ్యూలులో సోమవారాన్ని ‘పోలవారం’గా మార్చుకొని మరీ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయినా, ప్రాజెక్టు పనుల్లో ఆశించినంత వేగం కనిపించడంలేదు. ఇలా అయితే 2018నాటికి ప్రాజెక్టునుంచి గ్రావిటీతో నీరివ్వాలన్న లక్ష్యం నెరవేరదన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది.

ప్రాజెక్టు కాంట్రాక్టర్ అసమర్ధతవల్లనే పనులు నత్తనడకన ఉన్నాయని అభిప్రాయపడిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ ను మార్చాలని కోరింది. దానికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో… లక్షిత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కొన్ని పనులను వేరొక కాంట్రాక్టర్ కు అప్పగించక తప్పదన్న అభిప్రాయానికి వచ్చింది. ఆ విషయంలోనూ కేంద్ర,రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. లక్ష్యం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి నీరివ్వాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయమూ కేంద్ర అభిప్రాయమూ ఒకటేనని సానుకూల వచనాలు పలికిన గడ్కరీ… రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం ప్రాజెక్టును చేపట్టే విషయంలో మాత్రం అంత సానుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు.

పోలవరానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో సహా తాజా వివాద పరిష్కారంకోసం గడ్కరీ వద్ద జరిగిన సమావేశంలో… రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన పరిష్కారాల మాటేమోగానీ, ‘ఉమ్మడి పర్యవేక్షణ’ దిశగా కేంద్రం పావులు కదిపింది. ఇంతకు ముందు ముఖ్యమంత్రి ప్రతి సోమవారాన్ని పోలవారం చేసుకున్నట్టే ఇక కేంద్ర మంత్రి గడ్కరీ పక్షం రోజులకో రోజును పోలవరానికి కేటాయిస్తారన్నమాట.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Leave a Reply