చంద్రబాబు, మోడీ కలసి కుట్ర చేశారు

4 0

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఓర్వలేకపోయారు

ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రయత్నించారు

ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ధ్వజం

తాను మోడీని చూసి చంద్రబాబులా భయపడనని వ్యాఖ్య 

తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగప్రవేశం చేసిన రోజున ఆరోపణల పర్వం అనూహ్య మలుపు తీసుకుంది. నిజమాబాద్ సభలో నరేంద్ర మోడీ తనపై చేసిన విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ సభలో సమాధానమిచ్చారు. 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ విజయాన్ని చంద్రబాబు, నరేంద్ర మోడీ ఓర్వలేకపోయారని, తన ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టడానికి వారిద్దరూ కుట్ర చేశారని కేసీఆర్ తీవ్రమైన ఆరోపణ చేశారు.

తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రజలకు ఉన్న ఆకాంక్షలను కేసీఆర్ వమ్ము చేశారని, ఇప్పుడు తనపై తనకు నమ్మకం లేక జాతకాలను నమ్ముకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా కేసీఆర్ బుధవారం వివిధ ఎన్నికల సభల్లో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘నేను పూజ చేసుకుంటే నీ ముల్లె ఏం పోయెరా భాయ్...’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

విద్యుత్ రంగంలో విఫలమయ్యారన్న మోడీ మాటలను ప్రస్తావిస్తూ.. ‘‘నేను మహబూబ్ నగర్ లో హెలికాప్టర్ ఎక్కి నేరుగా నిజామాబాద్ వస్తా. నువ్వూ రా. అక్కడే చూద్దాం’’ అని సవాలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య ఉందని ప్రధానమంత్రి మాట్లాడాడంటూ.. ‘‘ప్రధానమంత్రి ఇంత తప్పుడు మాట మాట్లాడొచ్చా..ఇంత అల్పంగా మాట్లాడొచ్చా..’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

‘‘వాళ్ల అధ్యక్షుడు (అమిత్ షా) కూడా మొన్న ఆరోపణలు చేశాడు. రుజువు చేయి.. రాజీనామా చేస్తానన్నా. ఈరోజు నరేంద్ర మోడీని ఛాలెంజ్ చేస్తున్నా. మిస్టర్ నరేంద్ర మోడీ... తెలంగాణలో పవర్ సమస్య లేదు. నేను చెప్పడం కాదు. మీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఈఎ చెప్పింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ విషయం ప్రధానికి చేరాలనే హిందీలో, ఇంగ్లీషులో చెబుతున్నా’’ అని ఇంగ్లీషులో, హిందీలో కేసీఆర్ చెప్పారు.

తానెవరికీ భయపడబోనని తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ‘‘నేను చంద్రబాబులా మోడీకి భయపడే వ్యక్తిని కాను. నరేంద్ర మోడీని అడుగుతున్నా... 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమందా?

ఈ బక్క కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమందా? అని కేసీఆర్ ప్రత్యర్ధులపై చమత్కార బాణం వదిలారు. ‘‘ఇప్పుడు నరేంద్ర మోడీ బయలుదేరాడు. సోనియా గాంధీ, ఇంకో గాంధీ...ఆ... రాహుల్ గాంధీ.. సీపీఐ, సీపీఎం, చంద్రబాబునాయుడు టీడీపీ..ఇలా ఎంతమంది? ఎందుకు? మనం మొండిగా ఉంటాం కాబట్టి.. నిజాన్ని బల్ల గుద్దినట్టు మాట్లాడతాం కాబట్టి’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమ సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నాడని కేసీఆర్ ఆరోపించారు.

కేంద్రంలో ఇద్దరు దరిద్రులూ పోవాలి

కేంద్రంలో ఇన్నేళ్ళూ రాజ్యమేలిన బీజేపీ, కాంగ్రెస్ దేశానికి ఏం చేశాయని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘దేశంలో 70వేల టిఎంసిల నీరు పారుతోంది. వీళ్ల తెలివికి 30 వేల టిెఎంసిలు కూడా ఇప్పటివరకు వాడలేదు. చైనా 30 ఏళ్ల క్రితం మనకంటే వెనకబడి ఉంది. ఇప్పుడు వెయ్యి రెట్లు మెరుగ్గా ఉంది. మనకంటే చైనాలో వ్యవసాయ భూమి తక్కువ. అయినా ఆ దేశం అభివ్రుద్ధిలో అందనంత ఎదిగింది. ఈ దేశంలో ఇద్దరు దరిద్రులు (బీజేపీ, కాంగ్రెస్) పోవాలి. కేంద్రంలో రాష్ట్రాల ప్రభుత్వం... ఫెడరల్ ఫ్రంట్ రావాలి’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు.

తెలంగాణలో తన విషయంలో కాంగ్రెస్, బీజేపీ విరుద్ధమైన విమర్శలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ‘‘కాంగ్రెసోడు వచ్చి.. బీజేపీతో కుమ్మక్కయ్యానంటాడు.. ఇప్పుడు వీడొచ్చి కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యానంటాడు. నేను 2014లో ఎవరితో కలవలేదు. ఈరోజూ కలవలేదు. 119 స్థానాలకు పోటీ చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.