ఉత్తరాంధ్ర ప్రజలకు సిఎం సూచన
ఈనెల 18-20మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాను తాకిడి ఉంటుందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు సూచించారు. తుపాన్లు, పిడుగుల సమాచారాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రజలకు చేరవేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ముఖ్యమంత్రి నీరు-ప్రగతి, వ్యవసాయంపై సమీక్ష సందర్భంగా తుపానుపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళలాడాలని, ప్రతి రిజర్వాయర్ లో కనీస నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీశైలం కన్నా నాగార్జున సాగర్ లో నీటినిల్వ అధికంగా చేరడం శుభపరిణామమని, ఆ నీటిని సాగర్ ఆయకట్టుకు కుషన్ గా ఉంచుకోవాలని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 135టిఎంసిలు నిల్వ ఉంచితే రాష్ట్రానికి కొరత సమస్యే రాదన్నారు.
సంకల్పం మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నీరు-ప్రగతి, జలసంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ అందుకు ఉదాహరణలుగా చెప్పారు. ఆలస్యంగానైనా వర్షాలు సమృద్దిగా పడటంతో రైతులు సంతృప్తిగా ఉన్నారని, భూగర్భ జలమట్టం గత ఏడాదికన్నా 5.5 మీటర్లు పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.
పట్టిసీమ మంచి ఫలితాలు వచ్చాయి. పంటలతో కృష్ణా డెల్టా పచ్చగా ఉంది. పాలేరు వాగుకు గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. కుప్పంలో జలకళ ఉట్టిపడుతోంది. వాతావరణం అన్నివిధాలా కలిసివచ్చే పరిస్థితి ఉంది. చెక్ డ్యాముల నిర్మాణం, పంటకుంటల తవ్వకం వేగవంతం చేయాలి. శాశ్వతంగా కరవు నివారించే పరిస్థితి రావాలి’’
రాష్ట్రంలోని 63% చెరువులు నిండాయని, ఇంకా 37% చెరువులు నిండాల్సివుందని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన 2కోట్ల ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోవాలసి ఉందని, అందుకోసం పండ్లతోటల సాగు కోటి ఎకరాల్లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తుపాన్లకు ముందే పంట దిగుబడులు రైతుల చేతికి అందాలే చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధి హామి పనిదినాల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని, పంటకుంటల తవ్వకంలో దేశంలోనే ముందున్నామని, అంగన్ వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణంలో 3వస్థానంలో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
భారీవర్షాల వల్ల పంటనష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించాలి, వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. రైతుల నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు. 3వ విడత రుణఉపశమనం చెల్లింపులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదని, అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
పెన్షన్లు, బీమా పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని, బ్యానర్లు ప్రదర్శించాలని, చైతన్య స్ఫూర్తి పెంచే పాటలు వినిపించాలని సిఎం సూచించారు. సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న సిఎం.. 1100 కాల్ సెంటర్ సత్ఫలితాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో గౌరవం పెరుగుతోందని, ఇది సానుకూల పరిణామమని సిఎం సంతోషం వ్యక్తం చేశారు.
నిర్మాణం పూర్తయిన అన్నిఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించేలా చూడాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లలో మరుగుదొడ్లు తప్పనిసరి చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.