విభజన హామీలపై సమీక్ష: కేంద్రానికి చంద్రబాబు డిమాండ్

9 0

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వరం పెంచారు. అందులో భాగంగానే మొత్తం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక ప్యాకేజీలో పేర్కొన్న అంశాల అమలుపై సమీక్ష జరపాలని కేంద్ర హోంశాఖను డిమాండ్ చేస్తున్నారు. విభజన జరిగి మూడున్నరేళ్లు గడచినా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీలో పోలవరంపై మాట్లాడే సందర్భంలో విభజన హామీలనూ ప్రస్తావించిన సిఎం, ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో సమీక్ష డిమాండ్ ను ముందుకు తెచ్చారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి విభజన హామీలలో అపరిష్క్రుతంగా ఉన్న అంశాలపై మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. కేంద్ర హామీలను అమలు చేయించుకోవడానికి ఇప్పటివరకు రాష్ట్రం తరపున 62 సార్లు ప్రభుత్వ పెద్దలు, అధికారులను కలసినట్టు చెప్పిన  సిఎం, తాను స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అనేకసార్లు కలసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని, హోదాతో వచ్చే ప్రయోజనాలన్నిటినీ ప్యాకేజీ రూపంలో ఇస్తామని కేంద్రం హామీ ఇస్తే తాము అందుకు అంగీకరించామని సిఎం గుర్తు చేశారు. ఆ హామీల అమలు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నత్తనడక నడుస్తోందని ఆక్షేపించారు.

విభజన జరిగిన సంవత్సరం రాష్ట్రంలో రెవెన్యూ లోటు 17 వేల కోట్లు అని ఉమ్మడి రాష్ట్రంలోనే గవర్నర్ నిర్ధారించినా.. తర్వాత ఆ మొత్తం 7 వేల కోట్లు మాత్రమేనని కేంద్రం చెప్పిందని, చివరికి రూ. 4000 కోట్లతో సరిపెట్టారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి నగర నిర్మాణానికి ప్రాథమికంగా రూ. 32,000 కోట్లు అవసరమవుతాయని, అయితే కేంద్రం విడుదల చేసిన నిధులు నామమాత్రమని, రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రం 13 విద్యా సంస్థలు ఏర్పాటు చేసినా ఇప్పటిదాకా అరకొరగానే నిధులు ఇచ్చిందని, ఐఐటికి రాష్ట్ర ప్రభుత్వం 580 ఎకరాలు కేటాయిస్తే కేంద్రం కేవలం 18 కోట్లు విడుదల చేసిందని ఆక్షేపించారు. ఇంకా కేంద్రీయ, గిరిజన విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలో పేర్కొన్న సంస్థల ఆస్తుల విభజన ఇంకా జరగలేదన్నారు. ఈ విషయమై త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.

అసెంబ్లీ ఆవరణలో తనను కలసిన బిజెపి నేతలతోనూ ముఖ్యమంత్రి కేంద్ర హామీల విషయమై మాట్లాడారు. విభజన హామీలను తాను రాజకీయం చేయబోనని, సాధించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని చంద్రబాబు చెప్పారు. బిజెపి నాయకులు ప్రధాని మోదీని కలసి పోలవరం, మొత్తంగా విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని చంద్రబాబు సూచించారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కామినేని, బిజెపి ఇతర ప్రజా ప్రతినిధులు... క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు కేంద్రం సహకరించడంలేదన్న విమర్శలు చేస్తున్నారని, దీంతో స్నేహభావం చెడుతోందని చంద్రబాబుతో చెప్పారు.