ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అంశాలపై వారిద్దరూ చర్చించారు. పోలవరం కాంట్రాక్టర్ మార్పు విషయంలో రాష్ట్రం, కేంద్రం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచిన నేపథ్యంలో.. గడ్కరీ సోమవారం మార్పు ఉండదని స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు నాగపూర్ వెళ్ళి గడ్కరీని కలిశారు.
పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చేయడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంపై కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆచరణలో జరుగుతున్న జాప్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా మరిన్ని గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు.