చంద్రబాబు ప్రత్యేక హోదా అడిగారా… లేదా!

9 0
Read Time:3 Minute, 57 Second
లోక్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మ సందేహం
వైవి సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం ఏమిటి?

ప్రత్యేక హోదా అక్కర్లేదని కేంద్రంతో రాజీపడి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపైన ప్రతిపక్షం దాడి చేసింది. హోదా ఇచ్చే పరిస్థితి లేనందునే తాము ప్యాకేజీకి ఒప్పుకున్నామని పదే పదే చెప్పిన అధికారపక్షం… ఇక్కడ లొల్లి చేసేబదులు ఢిల్లీ వెళ్లి పోరాడాలని ప్రతిపక్షంపై ఎదురుదాడి చేసింది. ఈ విషయమై ఇప్పటికీ పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలకు ఓ ధర్మ సందేహం వచ్చింది.

అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా కావాలని అధికారికంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందా లేదా? ఇదే వైసీపీ నేతలకు వచ్చిన తాజా సందేహం. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఈమేరకు ఒక ప్రశ్నను లోక్ సభలో సంధించారు. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం బహుశా ఆ పార్టీ కోరుకున్న విధంగా లేదు.

ఇవీ ప్రశ్న, జవాబులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా కేంద్రాన్ని అభ్యర్ధించిందా లేదా’’- వైవి సుబ్బారెడ్డి.

ఈ ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ రాతపూర్వకంగానే బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదాను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి 2014 జూన్ మాసంలో అభ్యర్ధించారు’’ కేంద్ర మంత్రి.

రాష్ట్ర ఏర్పాటు (జూన్ 2, 2014) జరిగిన, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన (జూన్ 8, 2014) నెలలోనే ప్రత్యేక కేటగిరి హోదాకోసం ప్రభుత్వం అభ్యర్ధించిందన్నది కేంద్ర ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమవుతోంది.

నీతి ఆయోగ్ నివేదికేం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరి హోదా విషయమై ‘నీతి ఆయోగ్’ నివేదికను రూపొందించిందా? అన్నది సుబ్బారెడ్డి రెండో ప్రశ్న కాగా.. అలాంటిదేమీ లేదని కేంద్ర మంత్రి బదులిచ్చారు. 2014 ఫిబ్రవరి 20న అప్పటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీలమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయానికి చర్యలు చేపట్టిందని ఇందర్ జిత్ పేర్కొన్నారు.

2015-16 నుంచి 2019-20 వరకు వర్తించే ఐదేళ్ల అదనపు సాయం…‘విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టు (ఇఎపి)ల’కు కేంద్రమే నిధులు ఇవ్వడమనే రూపంలో ఉంటుందని మంత్రి తెలిపారు. ఆయా సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసే ప్రాజెక్టులకు ఈ హామీ వర్తిస్తుందని పేర్కొన్నారు.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply