Read Time:8 Minute, 11 Second
అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధే తనకు నిజమైన దీపావళి అని, నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్నింటా ముందు నిలిపేందుకు పండుగ రోజున కూడా విదేశీ పర్యటనకు వచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమెరికాలోని డెమోయిన్స్‌లో తెలుగుదేశం ఫోరం సమావేశంలో మాట్లాడారు.
ఈరోజు ఇంటిదగ్గర దీపావళి చేసుకోవాల్సిన మీరంతా ఇవాళ నాతో గడిపేందుకు వచ్చారు. నేనూ నా మనవడితో కలిసి పండుగ చేసుకోకుండా ప్రజల కోసం ఇక్కడికి వచ్చాను’.
గతంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చేసిన కృషి మీలా ఎంతోమందికి కొత్త అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆనాడు కేవలం 30 ఇంజినీరింగ్ కళాశాలలే వుంటే వాటి సంఖ్యను మూడొందలకు పెంచడం, దాంతో ఎందరో సాంకేతిక విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరడం జరిగిందని వివరించారు.
‘మీరిప్పుడు మంచిస్థాయిలో ఉన్నారు. మీ జన్మభూమిని మరువకండి. అలాగే మీ అందరినీ ఆదరించి ఈ స్థానంలో నిలిపిన ఈ నేలను సైతం మరచిపోవద్దు. ఇక్కడి ప్రజల మన్నన పొందండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలతో మీరు తృప్తి పడొద్దు. వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అదే సమయంలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రముఖులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
USISPF రౌండ్ టేబుల్ సమావేశానంతరం వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు జరిపారు. తొలుత ఐయోవా రాష్ట్రంలోని ప్రముఖ అమెరికన్ రాజకీయవేత్త, ప్రస్తుత ఐయోవా కార్యదర్శి విలియం హోవార్డ్ బిల్ నార్తేతో భేటీ అయ్యారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్ ప్రభుత్వ వ్యవసాయశాఖలో ఫామ్ ప్రొడక్షన్, కన్జర్వేషన్ అండర్ సెక్రటరీగా ఇటీవలే ఎంపికైన బిల్ నార్తేను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన రైతాంగ రుణ ఉపశమన పథకంపై నార్తే ఆసక్తి చూపించారు.
నవంబర్‌లో విశాఖలో జరగనున్న సమావేశానికి హాజరుకావాలని నార్తేను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రాష్ట్రానికి త్వరలో వేగనింగన్ విశ్వవిద్యాలయ బృందం ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో పోషకాహారం, జీవన ప్రమణాలు కలిగిన వాతావరణం కోసం కృషి చేస్తున్న వేగనింగన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రతినిధి బృందం త్వరలో రాష్ట్రానికి రానుంది. వేగనింగన్ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు ప్రొఫెసర్ ఎల్ఓ ఫ్రిస్కోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏఏ అంశాలలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉందో పరిశీలించడానికి తమ బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తానని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ ఫ్రిస్కో తెలిపారు. వ్యవసాయాన్ని మరింత ఆకర్షణీయంగా మలచి, రేపటితరం కర్షకులు లాభాల పంట ఎలా పండిచాలనే అంశంపై మరింత లోతుగా ఆలోచన జరగాలని ఫ్రిస్కో అన్నారు.
వ్యవసాయరంగంలో వైజ్ఞానిక అవసరాల కోసం ఉభయులం ‘గ్లోబల్ కన్సార్టియం’ ఏర్పాటు చేద్దామని ఫ్రిస్కోకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఐయోవా-వేగనింగన్ విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా ముందుకొచ్చి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒక కన్సార్టియంగా ఆవిర్భవిస్తే అందరికీ లాభదాయకమని సూచించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అంగీకరించిన ఫ్రిస్కో ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని అన్నారు. మరో 45 రోజులలో ఇరువురి భాగస్వామ్య కార్యక్రమం రూపుదాల్చగలదని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎంవోయూలపై ‘ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి’కి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.
సేంద్రీయ సాగుకు ‘మహర్షి విశ్వవిద్యాలయం’ సాయం!
సేంద్రీయ వ్యవసాయంలో నైపుణ్యం కలిగిన ఐయోవా ఫెయిర్‌ఫీల్డ్ సిటీలోని మహర్షి విశ్వవిద్యాలయం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షవ్యక్తం చేశారు. తనను కలిసిన మహర్షి విశ్వవిద్యాలయం అధ్యక్షుడు జాన్ హామెలిన్, గ్లోబల్ డెవలప్‌మెంట్ డీన్ విలియం గోల్డ్‌స్టీన్‌తో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపారు.
సేంద్రీయ వ్యవసాయంలో భూటాన్ దేశానికి సహకరిస్తున్న విధంగానే తమ ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు పాలేకర్ సహకారంతో ఇప్పటికే తమ రాష్ట్రంలో రెండు లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని తెలిపారు. తమ విశ్వవిద్యాలయాన్ని ఒకసారి సందర్శించాలని ముఖ్యమంత్రిని హామెలిన్, గోల్డ్‌స్టీన్ ఆహ్వానించారు. భారతదేశానికి చెందిన పది మంది వృత్తి నైపుణ్య శిక్షణార్ధులు, రైతులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్టు వెల్లడించారు.
చివరిగా వివిధ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో ముఖ్యమంత్రి విందు సమావేశం జరిపారు. తర్వాత ఐయోవా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ, జీవశాస్త్రాల కళాశాల ఆచార్యుడు వెండీ వింటర్సన్‌తోనూ భేటీ అయ్యారు. పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం ఐయోవా రాష్ట్ర రాజధానిలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్‌ప్రైజ్-2017’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఆర్థికాభివృద్ధి మండలి కార్య నిర్వహణ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు.