‘సెక్స్ బానిస’కు విగ్రహం… యుద్ధ బాధితులను గౌరవించిన ఫిలిప్పీన్స్

లైంగిక అవసరాలకోసం బలవంతంగా తమ మహిళలను ఉపయోగించుకున్న విదేశీయుల దురాగతాలకు గుర్తుగా ఫిలిప్పీన్స్ దేశం ‘సెక్స్ బానిస’ విగ్రహాన్ని ఆవిష్కరించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యానికి లైంగిక అవసరాలు తీర్చిన 1000 మంది ఫిలిప్పీన్స్ మహిళలను ఈ విధంగా గౌరవించింది. ‘కంఫర్ట్ ఉమెన్’గా వ్యవహరించిన వీరి గౌరవచిహ్నంగా ఒక విగ్రహాన్ని ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శుక్రవారం ఆవిష్కరించారు.

విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా అక్కడా ఇక్కడా కాదు. ప్రస్తుతం జపాన్ ఎంబసీ కొలువై ఉన్న ప్రదేశంలోనేనట. ఆ ప్రాంతంలోనే ఫిలిప్పీన్స్ మంత్రులు కూడా ఉంటుంటారు. తలపై స్కార్ఫ్ ధరించిన మహిళ కళ్ళకు గంతలు కట్టినట్టుగా… రెండు మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని తయారు చేశారు. ‘కంఫర్ట్ ఉమెన్’ అనుభవించిన బాధలను గుర్తు చేసుకోవడం ఈ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్టు ఫిలిప్పీన్స్ జాతీయ చారిత్రక కమిషన్ ఛైర్మన్ రెనె ఎస్కలాంటె చెప్పారు.

1942 నుంచి 1945 వరకు ఫిలిప్పీన్స్ జపాన్ కాలనీగా ఉంది. ఆ సమయంలోనే 1000 మంది ఫిలిప్పీన్స్ మహిళలను జపాన్ సైన్యం ‘కంఫర్ట్ ఉమెన్’గా ఉపయోగించుకున్నారు. లీగ్ ఆఫ్ ఫిలిప్పినో ఉమెన్ అనే సంస్థ ఆనాటి ‘కంఫర్ట్ ఉమెన్’పై 174 పేజీల నివేదికను రూపొందించి 1990లో విడుదల చేసింది. అప్పటి బాధితుల్లో కొందరు ఇంకా బతికే ఉన్నారు. వారు ఇప్పటికీ న్యాయంకోసం పోరాడుతున్నారు. అయితే, ఈ క్రమంలో ఒక్కరొక్కరుగా మరణిస్తున్నారుగాని, న్యాయం మాత్రం దొరకలేదు.

Leave a Comment