వచ్చే ఐదేళ్లకు చైనా గమనాన్ని నిర్ధేశించేది ఇక్కడే…
చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఐదేళ్ళకోసారి జరిగే సీపీపీ కాంగ్రెస్.. రానున్న ఐదేళ్ళ కాలానికి చైనాను ఎవరు నడిపించాలి? దేశ గమనం ఎలా ఉండాలి? అన్నది నిర్ణయించే కీలక సందర్భం. బుధవారం నుంచి వారం రోజులపాటు (24వ తేదీవరకు) మహాసభలు జరుగుతాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ మహాసభలకు అధ్యక్షత వహిస్తున్నారు.
2012లో జి జిన్ పింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటినుంచి మరో ఐదేేళ్ళపాటు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. జిన్ పింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన ప్రధానమైన చర్యలలో ’అవినీతిపై యుద్ధం’ ముఖ్యమైనది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నాయకులతో సహా లక్షల మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. కమ్యూనిస్టు విలువలపట్ల జిన్ పింగ్ నిబద్ధతకు ఇదొక సాక్ష్యమని చైనా ప్రజలు భావించారు. మరోవైపు అంతర్జాతీయ రాజకీయ యవనికపైనా చైనా ప్రభావం ఈ ఐదేళ్ళలో మరింత పెరిగింది. వచ్చే ఐదేళ్లలో చైనా గమనం ఈ మహాసభలలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
చైనా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న 8.9 కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 2,280 మంది ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ గత ఏడాది నవంబర్ లోనే ప్రారంభం కాగా 99.2 శాతం మంది సభ్యులు ఈ ఎన్నిక ప్రక్రియలో భాగస్వాములయ్యారు. సైద్ధాంతికంగా బలమైన, రాజకీయంగా నిబద్ధతగల, మంచి నడవడిక గల పార్టీ సభ్యులను ప్రతినిధులుగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. పార్టీలోని ఎలక్టోరల్ యూనిట్లనుంచి మొత్తం 2,287 మంది ప్రతినిధులుగా ఎన్నిక కాగా పరిశీలన అనంతరం వారిలో 2,280 మందిని ఖరారు చేశారు. వీరు కాకుండా 74మంది ప్రత్యేక ఆహ్వానితులుగా హజరయ్యారు.
సీపీసీ మహాసభలకు కమ్యూనిస్టేతర ప్రముఖులను కూడా కొందరిని ఆహ్వానించారు. వారితోపాటు కొందరు పార్టీ ప్రముఖులు కూడా నాన్ ఓటింగ్ ప్రతినిధులుగా హాజరయ్యారు. వీరి మొత్తం సంఖ్య 405 కాగా మరో 149 మంది అతిధులు మహాసభలకు హాజరవుతున్నారు. మహాసభల ప్రారంభం, ముగింపు సమావేశాలకు వీరు హాజరవుతున్నారు. బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ ఈ మహాసభలకు వేదిక. జిన్ పింగ్ అధ్యక్షోపన్యాసంతో ప్రారంభమైన ఈ సభా నిర్వహణకోసం 42 మందితో స్టాండింగ్ కమిటీని ఎన్నుకున్నారు. మభాసభలలో పార్టీ కొత్త కమిటీల ఎన్నిక జరుగుతుంది.