’సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు’ అనే పుస్తకంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో శనివారం విజయవాడలో రచయిత కంచె ఐలయ్యతో వివిధ సంఘాలు తలపెట్టిన సభకు పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. కంచె ఐలయ్య విజయవాడ వస్తే అరెస్టు చేస్తామని స్వయంగా డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించారు. ఓవైపు సామాజిక ఉద్యమకారులు ఐలయ్యకు మద్ధతుగా, మరోవైపు బ్రాహ్మణ- వైశ్య సంఘాలు ఆయనకు వ్యతిరేకంగా.. జింఖానా గ్రౌండ్స్ లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే, పోలీసులు ఎవరికీ అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో… ఐలయ్య వ్యతిరేక సభను రద్దు చేసుకున్నారు.
విజయవాడలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఇరు వర్గాల సభలకోసం ఎవరూ తరలిరావద్దని నగర పోలీసులు సూచించారు. ఇరు వర్గాల సభలకు, రెచ్చగొట్టే ప్రకటనలకు సంబంధించి 298 మందికి నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. అందులో భాగంగా కంచె ఐలయ్యకు కూడా హైదరాబాద్ వెళ్ళి నోటీసు అందజేశారు. ఆయన విజయవాడ రావద్దని పోలీసులు సూచించారు. ఐలయ్యను గ్రుహనిర్భంధంలో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు.
కుల మతాల సభలకు అనుమతి ఇవ్వలేం
ఇదే విషయమై శుక్రవారం డీజీపీ మాట్లాడుతూ.. జింఖానా గ్రౌండ్స్ లో సభలు నిర్వహించడానికి ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. కుల మతాలకు, ఆందోళనలకు సంబంధించిన సభలకు అనుమతి ఇవ్వలేమని ఆయన చెప్పారు. గతంలో తునిలో కాపుల సభ సందర్భంగా జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఐలయ్య విజయవాడకు వస్తే అరెస్టు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఐలయ్య అనుకూల వ్యతిరేక సభలను పొరుగు రాష్ట్రాల్లో కూడా నియంత్రించిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్న డీజీపీ… జగన్ పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడంలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అనుమతి తీసుకొని ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చన్నారు. ’ఎవరైనా అనుమతి తీసుకోవలసిందే…నిబంధనలకు అనుగుణంగా పాదయాత్రలు చేసుకోవచ్చు’ అని డీజీపీ పేర్కొన్నారు.