కేంద్రంపై మారిన తెలుగుదేశం పార్టీ వైఖరి
పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన
సస్పెండ్ అయినా తగ్గేది లేదు
హాట్ హాట్ గా పార్లమెంటరీ పార్టీ సమావేశం
విభజన హామీల అమలుపై సమీక్షకు అల్టిమేటమ్
విడాకులవరకు వెళ్ళలేదు. అయితే, స్వరాలు పదునెక్కాయి. ఒకరు ఇక యుద్ధం చేయాల్సిందేనన్నారు. మరొకరు కేంద్రం నుంచి తప్పుకుందామన్నారు. బడ్జెట్ పై మొదలైన చర్చ విభజన హామీల మీదుగా బీజేపీని వదలించుకుందామనేవరకు వెళ్ళింది. ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారిక నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం టోన్ ఇది.
విడాకులకు ముందు తుది ప్రయత్నం చేయాలని టీడీపీపీ నిర్ణయించింది. ఇదివరకులా ముసుగులో గుద్దులాట కాకుండా బహిరంగంగానే తేల్చుకోవాలని పార్టీ అధినేత సమక్షంలో ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. విభజన హామీల అమలుకు అల్టిమేటం జారీ చేసి... పార్లమెంటు వేదికగా నిరసన తెలపాలని టీడీపీపీ నిశ్చయించింది. అప్పటికీ కేంద్రంనుంచి సరైన స్పందన రాకపోతే తదుపరి దశకు వెళ్దామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు చెప్పారు.
మూడు రోజుల క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్... విభజిత ఆంధ్రప్రదేశ్ అవసరాలను, కేంద్రమే గతంలో ఇచ్చిన హామీలను సైతం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... కేంద్రం, రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య పెరిగిన అగాథాన్ని ఆదివారంనాటికి టీడీపీపీ సమావేశం ప్రతిఫలించింది. చంద్రబాబు... బడ్జెట్లో ఏపీ పట్ల నిర్లక్ష్యాన్ని, అంతకు ముందు విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని ఆక్షేపించారు. చివరికి బిజెపితో రాజకీయంగా, సైద్ధాంతికంగా ఉన్న విభేదాలనూ ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కేంద్రానికి దాదాపు అల్టిమేటం జారీ చేసింది. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమీక్ష జరపాలి. ఏం చేస్తారో చెప్పాలి. మళ్ళీ హామీలు ఇవ్వడం కాదు.. నేరుగా చర్యలు కావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. నిరసనలు తెలపాలని, సస్పెండ్ అయినా వెనకాడవద్దని స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్ 2018పై అనేక పార్టీలు ఆక్షేపణ తెలిపాయన్న చంద్రబాబు... ‘‘పునర్యవస్థీకరణ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే.. హామీల అమలు కేంద్రం బాధ్యత. పోలవరం జాతీయ ప్రాజెక్టు. వాటితో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన అనేక హామీల అమలుకోసం నేను 28 సార్లు ఢిల్లీ వెళ్ళాను. అనేకసార్లు ప్రధానమంత్రి మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశాను. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం నిరాశాజనకంగానే ఉంది. కనీసం మిత్రపక్షమనే సానుకూలత కూడా చూపడంలేదు’’ అని కేంద్రాన్ని ఆక్షేపించారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తొలి సెషన్ ఇంకా మూడు రోజులే జరిగే అవకాశం ఉందని, ఈ మూడు రోజుల్లోనే కేంద్రం ఏదైనా స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. సోమవారం సంతాప తీర్మానంతో సభ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే, పార్లమెంటు వెలుపల కూడా ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు. ‘‘ఈ నాలుగు రోజులపాటు రోజూ ఉదయం, సాయంత్రం మీతో మాట్లాడతా. రోజువారీ జరిగే పరిణామాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుంది’’ అని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు.
కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయడం నిమిషం పని అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘జగన్ నాటకాలాడుతున్నాడు. కేసుల మాఫీకోసం ప్రయత్నిస్తున్నాడు. కేంద్రానికి దగ్గరకావడం కోసం టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ ఎత్తుగడలను ప్రజలకు వివరించాలి’’ అని చంద్రబాబు సూచించారు. తాను ఎవరికీ భయపడనన్న చంద్రబాబు ‘‘నాపైన ఏం కేసులు పెడతారు? ఒకవేళ పెట్టినా లెక్క చేసేవాడిని కాను’’ అని ఉద్ఘాటించారు.
ఇప్పటిదాకా అంతర్గతంగానే ఒత్తిడి తెచ్చామని, ఇక బహిరంగంగానే పోరాడదామని సూచించారు. బీజేపీతో సిద్ధాంతపరమైన విభేదాలను ప్రస్తావిస్తూ... ట్రిపుల్ తలాఖ్ బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని విభేదించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర విమాన యాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు, ఎంపీ సీఎం రమేష్ మినహా మిగిలిన ఎంపీలు టీడీపీపీ సమావేశానికి హాజరయ్యారు.