ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి శాఖ అధికారులు చాలా ఆలస్యంగానైనా ఒక డబుల్ ఏజంట్ ను పట్టేశారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై నిఘా ఉంచి వారిని పట్టుకోవలసిన శాఖలో… ఆ అవినీతి అధికారులకే సమాచారం అందిస్తూ దొరికిపోయాడో ప్రబుద్ధుడు. ఏసీబీలో రహస్య సమాచార విభాగంలో పని చేస్తున్న మేనేజర్ శోభన్ బాబు… తమ శాఖ ఎవరిపై నిఘా ఉంచిందో వారికే ఆ రహస్య సమాచారాన్ని అందించాడు. ఈ విషయాన్ని ఇటీవలే ఉన్నతాధికారులు గుర్తించారు.
ఏసీబీ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ తాజాగా అతనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. శోభన్ బాబు చాలా కాలంగా అవినీతిపరులైన అధికారులకు సమాచారం అందిస్తూ ప్రతిఫలం పొందుతున్నట్టు ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. ఏసీబీకి ఫిర్యాదులు వచ్చినప్పటినుంచి దాడులు నిర్వహించేవరకు అధికారుల కదలికలు రహస్యంగా ఉండాలి. అయితే, ఆయా దశలలో ఉన్న కేసుల్లో శోభన్ బాబు నిందితులకు సహకరించినట్టు చెబుతున్నారు.
పలు ప్రభుత్వ శాఖల్లోని అవినీ‘తిమింగలాల’ను ఇటీవల ఏసీబీ బయటపెట్టింది. వారిలో కొందరు రూ. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారు. అలాంటివారికి శోభన్ బాబు వంటి ఏసీబీ సిబ్బంది సహకరిస్తున్నారు. అన్ని శాఖలపై నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు ఇంటిదొంగను గుర్తించడం మాత్రం ఆలస్యమైంది. సుమారు 50 మంది అవినీతి అధికారులకు శోభన్ బాబు ఇప్పటిదాకా ఏసీబీ కదలికలపై సమాచారం అందించినట్టు చెబుతున్నారు.
శోభన్ బాబును గుర్తించడం కూడా యాధృఛ్చికంగా జరిగిందంటున్నారు. ఇతర శాఖల అధికారులను పట్టుకునే సందర్భాల్లో ఏసీబీ అధికారులు వారి కాల్ జాబితాలను కూడా సేకరించడం సహజం. ఆయా నిందితుల్లో కొందరి కాల్ జాబితాలను పరిశీలించినప్పుడు శోభన్ బాబు ఫోన్ నెంబర్ ఉండటం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. అప్పుడే తమ శాఖనుంచి సమాచారం లీకవుతున్నట్టు గుర్తించారు. ఇలా నిందితులకు శోభన్ బాబు చేసిన ఫోన్ కాల్స్ 733 ఉన్నట్టు సమాచారం.