Exclusive : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 1,91,064 కోట్లు

కేంద్రం మొండిచేయి చూపిన నేపథ్యంలో…

రాష్ట్ర బడ్జెట్ పైనే కేటాయింపుల భారం
పోలవరం ప్రాజెక్టుకు 9988 కోట్లు
విద్య, గ్రామీణ రంగాలకు భారీగా కేటాయింపులు

కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిన నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ. 1,91,063.61 కోట్లు. ‘న్యూస్ ల్యాండ్’కు ప్రత్యేకంగా లభ్యమైన సమాచారం ప్రకారం 2018-19 రాష్ట్ర బడ్జెట్ రూ. 5,235 కోట్ల రెవెన్యూ మిగులుతో ప్రతిపాదించనున్నారు. ద్రవ్యలోటు రూ. 24,205.21గా ఉంటుందని అంచనా. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.78 శాతం. రెవెన్యూ మిగులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.60 శాతంగా ఉంటుందన్నది యనమల అంచనా.

విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లోనూ విద్య, గ్రామీణ రంగాలకు పెద్ద పీట వేస్తున్నారు. 2018-19లో పాఠశాల విద్యకు రూ. 21,612 కోట్లు, ఉన్నత విద్యకు మరో రూ. 2,835 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం… పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 23,439 కోట్లు కేటాయిస్తోంది. ఇరిగేషన్ కు రూ. 16,978 కోట్లు కేటాయిస్తోంది. అందులో పోలవరం ప్రాజెక్టుకే 9988.21 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపుల కంటే 41 శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి సైతం నిధులు తగ్గించడంతో ఈసారి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయింపులు పెంచారు. విద్యా రంగానికి 20 శాతం, గ్రామీణ రంగానికి 11 శాతం అదనంగా కేటాయింపులున్నాయి.

వ్యవసాయ రంగానికి 37 శాతం పెంచి 10,097 కోట్లు కేటాయించారు. ఇది కాకుండా పశు సంవర్ధక శాఖకు మరో 1,743 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదికంటే 25 శాతం అధికం. ఆరోగ్య రంగానికి కూడా నిధులు భారీగా పెంచారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ, సీఆర్డీయేలకు ఏకంగా 49 శాతం పెంచి 7741 కోట్లు కేటాయించారు. హోంశాఖకు రూ. 6,226 కోట్లు, ఇంథన మౌలిక సదుపాయాల విభాగాలకు రూ. 5,140 కోట్లు కేటాయించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖకు రూ. 4,703 కోట్లు కేటాయించారు. ఐటీ శాఖకు గత ఏడాది కేటాయించిన రూ. 364 కోట్లనుంచి ఏకంగా రూ. 1007 కోట్లకు పెంచారు.

పథకాల వారీగా చూసినప్పుడు ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా కేటాయింపులున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం నేపథ్యంలో కొన్ని పథకాలకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పాత పథకాలకు నిధులు పెంచుతూనే కొన్ని కొత్త పథకాలకు కేటాయించారు. ఎన్టీఆర్ పింఛన్లకు రూ. 5000 కోట్లకు కేటాయింపులు పెరిగాయి. సంక్షేమంలో…. గృహ నిర్మాణానికి రూ. 4,752 కోట్లు కేటాయించారు. రైతు రుణ మాఫీకి రూ. 4100 కోట్లు కేటాయిస్తున్నారు.

నిరుద్యోగ భృతికి ఈ ఏడాది ఏకంగా రూ. 1000 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ. 500 కోట్లు కేటాయించినా పథకం అమల్లోకి రాలేదు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకోసం రూ. 1000 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ మొత్తం కేవలం రూ. 110 కోట్లుగా ఉంది. స్మార్ట్ సిటీలకు రూ. 800 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ రోడ్లకు 1413 కోట్లు, అర్బన్ ఏరియాలలోని ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాలకు 600 కోట్లు కేటాయించారు. అమరావతి కేపిటల్ సిటీకి మాత్రం నిధులు తగ్గించారు. సిటీ నిర్మాణ వ్యవహాలకు 575 కోట్లనుంచి రూ. 457 కోట్లకు, లాండ్ పూలింగ్ కు 247 కోట్లనుంచి 166 కోట్లకు కేటాయింపులు తగ్గాయి.

చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, చంద్రన్న పెళ్ళి కానుక, భూమి కొనుగోలు, ఇళ్ళ స్థలాలు, పౌష్ఠికాహారం తదితర పథకాలకు నిధులను పెంచారు. అదే సమయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ, పారిశ్రామికవాడల్లోనూ మౌలిక సదుపాయాలకూ పెద్ద పీట వేశారు. కొత్తగా నిధులు కేటాయించారు.

Related posts

Leave a Comment