Exclusive : థర్డ్ జెండర్ కు తొలిసారి నిధులు, మహిళలకు శానిటరీ నాప్కిన్స్

5 0

మహిళా దినోత్సవాన ప్రవేశపెడుతున్న బడ్జెట్లో జెండర్ సెన్సిటివిటీ

డ్వాక్రా మహిళల శానిటరీ నాప్కిన్స్ కోసం 100 కోట్లు

విద్యార్ధినుల శానిటరీ నాప్కిన్స్ కోసం మరో రూ. 27 కోట్లు

అనేక కొత్త పథకాలకు బడ్జెట్ లో పెద్ద పీట

కొన్ని కొన్ని ప్రతిపాదనలు ఆయా ప్రభుత్వాల ఆలోచనలను, ప్రాధాన్యతలను తెలియజేస్తాయి. కేంద్ర ప్రభుత్వం శానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీలో భాగంగా పన్ను విధించి దేశవ్యాప్తంగా మహిళల విమర్శలకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో ప్రతిపాదించిన కొన్ని అంశాలు ఇందుకు భిన్నమైనవి. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెడుతున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో మహిళలు, విద్యార్ధినుల శానిటరీ నాప్కిన్స్ కోసం నిధులు కేటాయించడం ప్రశంసనీయం. ‘న్యూస్ ల్యాండ్’కు ప్రత్యేకంగా లభ్యమైన బడ్జెట్ వివరాల ప్రకారం...శానిటరీ నాప్కిన్స్ కోసం డ్వాక్రా మహిళలకు రూ. 100 కోట్లు, పాఠశాల విద్యార్ధినులకు మరో రూ. 27 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో తొలిసారిగా థర్డ్ జెండర్ ప్రజల సంక్షేమానికి రూ. 20 కోట్లు బడ్జెట్ కేటాయించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకే ఈ బడ్జెట్లో రూ. 100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ఈ బడ్జెట్లో గణనీయంగా కేటాయింపులు చూపించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని అంశాలకు 2017-18 బడ్జెట్లో రూ. 1657 కోట్లు కేటాయించగా 2018-19 ఆర్థిక సంవత్సరంకోసం రూ. 2839 కోట్లు కేటాయించారు. ఇది 71.33 శాతం అదనం. అందులో పౌష్ఠికాాహారానికి రూ. 470 కోట్లనుంచి 821 కోట్లకు పెరిగింది. ఇంటర్ స్థాయిలో పౌష్ఠికాహారంకోసం ప్రత్యేకంగా 23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఒకటో తరగతినుంచి 10వ తరగతివరకు ఉన్న విద్యార్ధులకు కోడిగుడ్ల పంపిణీకోసం రూ.277 కోట్లు కేటాయించింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకోసం గత బడ్జెట్లో రూ. 110 కోట్లు మాత్రమే కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లకు పెంచుతున్నారు

అన్న అమృత హస్తానికి రూ. 53 కోట్లనుంచి 195 కోట్లకు పెంచారు. వికలాంగుల సంక్షేమానికి కేటాయింపులను రూ. 89.50 కోట్లనుంచి 121.54కోట్లకు పెంచారు. వికలాంగుల పరికరాలకోసం 2017-18లో 13 కోట్లు కేటాయించగా ఇప్పుడు 35 కోట్లు కేటాయించారు. రీహాబిలిటేషన్ కోసం 9.26 కోట్లనుంచి 30 కోట్లకు పెంచారు. ఈసారి క్రీడారంగానికీ గణనీయంగా నిధులు పెంచారు. శాప్ కు 2017-18లో కేవలం 15.95 కోట్లు కేటాయించగా ఈసారి ఏకంగా 100 కోట్లకు పెంచారు.

కొత్త పథకాలకు కేటాయింపులివే

కొత్తగా ట్రాన్స్ జెండర్ జనాభాకోసం 20 కోట్లు

కొత్తగా బస్సుల కొనుగోలుకోసం ఆర్టీసీకి రూ. 200 కోట్లు

రెసిడెన్షియల్ స్కూలు భవనాల నిర్మాణంకోసం కొత్తగా రూ. 250 కోట్లు

చంద్రన్న పెళ్ళి కానుకకు కొత్తగా రూ. 100 కోట్లు

బీసీలకు చంద్రన్న పెళ్ళి కానుక కోసం రూ. 150 కోట్లు

అన్న క్యాంటీన్లకు రూ. 200 కోట్లు

హౌస్ సైట్లకోసం భూసేకరణకు రూ. 575 కోట్లు

ఆదరణకు 500 కోట్లు

భూమి కొనుగోలు పథకానికి రూ. 100 కోట్లు

లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ పరిధిలో చంద్రన్న బీమాకు రూ. 140 కోట్లు

ఇ ప్రగతికి రూ. 200 కోట్లు

స్టార్టప్ లకు రూ. 100 కోట్లు

ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ అండ్ ఇన్ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు

ఫైబర్ గ్రిడ్ మౌలిక సదుపాయాలకోసం రూ. 400 కోట్లు

ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కు కొత్తగా రూ. 200 కోట్లు

మెగా సీడ్ పార్కుకు రూ. 100 కోట్లు

ఐటీడీఎలలో మార్కెటింగ్, స్టోరేజీ సదుపాయాలకోసం రూ. 50 కోట్లు

పశువులకు బీమాకోసం కొత్తగా రూ. 50 కోట్లు

గిరిజనులకు ఫుడ్ బాస్కెట్స్ కోసం రూ. 40 కోట్లు

గిరిజనులకు భూమి కొనుగోలు పథకానికి రూ. 20 కోట్లు

టెక్నికల్ ఎడ్యుకేషన్ లో కొత్తగా మూడు పథకాలకు 116 కోట్లు

డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్ కోసం రూ. 100 కోట్లు

విద్యార్ధినులకు శానిటరీ నాప్కిన్స్ కోసం రూ. 27 కోట్లు కొత్తగా కేటాయించారు

ఇంటర్ స్థాయిలో విద్యార్ధులకు పౌష్ఠికాహారం అందించేందుకు రూ. 23 కోట్లు

ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం రూ. 70 కోట్లు

మోడల్ పాఠశాలలకోసం కొత్తగా రూ. 377.10 కోట్లు

ఒకటో తేదీనుంచి పదో తేదీవరకు విద్యార్ధులకు కోడిగుడ్ల పంపిణీకోసం రూ. 266.72 కోట్లు

పాఠశాలల్లో కేవలం టాయిలెట్ల మెయింటనెన్స్ కు రూ. 100 కోట్లు...

రియల్ టైమ్ గవర్నెన్స్ పరిష్కార వేదికకు రూ. 100 కోట్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎన్టీఆర్ జలసిరికోసం ప్రత్యేకంగా రూ. 100 కోట్లు

ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ కు కొత్తగా రూ. 270 కోట్లు...

ప్రధానమంత్రి మాతృ వందన యోజనకు రూ. 160 కోట్లు..

ఇవి కాకుండా యూనివర్శిటీలలో కేపిటల్ ఎసెట్ల కోసం రూ. 310 కోట్లు

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అదనపు సాయం కోసం ప్రత్యేకించి 100 కోట్లు

ఇతర ప్రాధాన్యతాంశాలు

ఎన్టీఆర్ సామాజిక పింఛన్లకోసం రూ. 5000 కోట్లు కేటాయించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 4312 కోట్లుగా ఉంది. స్వచ్ఛభారత్ మిషన్ కు కేటాయింపులను రూ 514.81 కోట్లనుంచి ఏకంగా రూ. 1450 కోట్లకు పెంచారు. బడికొస్తా పథకానికి గతంలో కేవలం కోటి రూపాయలు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 160 కోట్లు కేటాయించారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ పథకానికి గత బడ్జెట్లో కేవలం 39.98 కోట్లు ఉండగా ఈ ఏడాది అది 300 కోట్లకు పెరిగింది. ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజనకు 198 కోట్లనుంచి 420.85 కోట్లకు పెంచారు. ఉపాధి హామీలో ఫండ్స్ కన్వర్జెన్స్ కోసం గత ఏడాది 330 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 750 కోట్లకు పెంచారు. డిమాండ్ ను బట్టి నిధులువచ్చే ఉపాధి పథకంలోనైనా ఎక్కువ నిధులు రాబట్టుకోవాలన్న తపన ఇందులో కనిపిస్తోంది.

మైనర్ ఇరిగేషన్ లో నీరు, చెట్టు పథకానికి 110.36 కోట్లనుంచి 500కోట్లకు పెంచారు. ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టుకు 160.36 కోట్లనుంచి 469.41 కోట్లకు పెంచారు. రాష్ట్ర రహదారులకోసం 72 కోట్లనుంచి 250 కోట్లకు పెంచారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇరిగేషన్లో కేటాయింపులు గణనీయంగా పెంచారు. 2017-18లో 124.49 కోట్లు మాత్రమే కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 532.33 కోట్లు కానుంది. ఒంగోలుకు 230.50 కోట్లనుంచి 390.41 కోట్లకు పెంచారు. గోదావరి డెల్టాకు 192.88 కోట్లనుంచి 569.52 కోట్లకు పెంచారు. క్రుష్ణా డెల్టాకు 113.27 కోట్లనుంచి 243.45 కోట్లకు పెరిగింది.

పోలవరం గత బడ్జెట్లో 7084.44 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో 40.99 శాతం పెంచారు. ఆరోగ్య రంగానికి రూ. 8463 కోట్లు (7020 కోట్ల నుంచి) కేటాయించారు. ఎన్టీఆర్ పింఛన్లకు రూ. 5000 కోట్లు, హౌసింగ్ కు  రూ. 4,752 కోట్లు (రూ. 1452 కోట్ల నుంచి ఏకంగా మూడు రెట్లు), రైతు రుణ మాఫీకి రూ. 4100 కోట్లు (3600 కోట్లనుంచి), నిరుద్యోగులకు భ్రుతికోసం రూ. 1000 కోట్లు (గత బడ్జెట్లో 500 కోట్లు) కేటాయించారు. పంచాయతీరాజ్ రోడ్లకు రూ. 890 కోట్లనుంచి 1413 కోట్లకు పెంచారు. స్మార్ట్ సిటీలకు కేటాయింపులు 450 కోట్లనుంచి రూ. 800 కోట్లకు పెరిగాయి. అర్బన్ ఏరియాలలో ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాలకు కేటాయింపులను రూ. 260 కోట్లనుంచి 600 కోట్లకు పెంచారు. అమరావతి కేపిటల్ సిటీకి మాత్రం కేటాయింపులు రూ. 575 కోట్లనుంచి రూ. 457 కోట్లకు తగ్గాయి. లాండ్ పూలింగ్ కు 247 కోట్లనుంచి 166 కోట్లకు తగ్గాయి.

Leave a Reply