కన్నడ సీమలో కమలానికి పరాభవం, కాంగ్రెస్ వైపు మొగ్గిన ఎగ్జిట్ పోల్స్

27 0

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన మీడియా సంస్థల్లో ఎక్కువ భాగం నిర్ధారించాయి. కాంగ్రెస్ పార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత నిర్ణాయక మెజారిటీని కైవసం చేసుకుంటుందని కొన్ని సంస్థలు తేల్చి చెప్పగా, మరికొన్ని మెజారిటీకి అటూ ఇటూగా సీట్లు సాధిస్తుందని తెలిపాయి. ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ మినహా మిగిలినవన్నీ బిజెపి కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని స్పష్టం చేశాయి.

బుధవారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే అనేక వార్తా సంస్థలు - అందులో అధిక భాగం బిజెపి అనుకూల సంస్థలు - ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి.  ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి వుంది.

224 సీట్లు ఉన్న కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 140 వరకు వస్తాయని ‘ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మెజారిటీకి కావలసిన 113 సీట్ల కంటే కనీసం 9 సీట్లు, గరిష్టంగా 27 సీట్లు అధికంగా వస్తాయన్నది ఈ పోల్ సారాంశం. బిజెపి 62, 80 సీట్ల మధ్య ఆగిపోతుందని, జెడి(ఎస్) 20 నుంచి 25 సీట్లు సాధించవచ్చని ఈ సర్వే పేర్కొంది. ఇది కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపిన సర్వే. ‘టైమ్స్ నౌ- ఇటిజి’ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 113 సీట్లతో బొటాబొటీ మెజారిటీ సాధిస్తుంది. బిజెపి 85 సీట్లు, జెడి(ఎస్) 23 సీట్లు సాధిస్తాయని టైమ్స్ నౌ పేర్కొంది. ఈ రెండు సర్వేలు కాంగ్రెస్ పార్టీకి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుందని పేర్కొనడం విశేషం.

‘ఎబిపి న్యూస్- సి ఓటర్’ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీకి 100 నుంచి 112 సీట్లు, బిజెపికి 83 నుంచి 95 సీట్లు, జెడి(ఎస్)కు 21 నుంచి 29 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ‘జి న్యూస్- మెట్రిజ్’ పోల్ కాంగ్రెస్ పార్టీకి 103 నుంచి 118, బిజెపికి 79 నుంచి 94, జెడి(ఎస్)కు 25 నుంచి 33 అంచనా వేసింది. ‘పి మార్క్- రిపబ్లిక్’ పోల్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108 సీట్లు, బిజెపికి 85 నుంచి 100 సీట్లు, జెడి(ఎస్)కు 24 నుంచి 32 సీట్లు వస్తాయని పేర్కొంది. ‘టివి 9 భారత్ వర్ష్- పోల్ స్టార్ట్’ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 99 నుంచి 109 సీట్లు, బిజెపి 88 నుంచి 98, జెడి(ఎస్) 21 నుంచి 26 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

‘ఆసియానెట్ సువర్ణ- జన్ కి బాత్’ ఎగ్జిట్ పోల్ ఒక్కటే కాంగ్రెస్ కంటే బిజెపికి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొనడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం బిజెపి 94 నుంచి 117 సీట్లు, కాంగ్రెస్ 91 నుంచ 106, జెడి(ఎస్) 14 నుంచి 24 సీట్లు గెలుచుకుంటాయి. ఈ సర్వే ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసినన్ని సీట్లు (113) వచ్చే అవకాశం ఒక్క బిజెపికి మాత్రమే ఉంది.

కాంగ్రెస్ పార్టీకి సొంతగానే మెజారిటీ రావచ్చన్నది ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ సారాంశం కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు జెడి(ఎస్) అవసరం రావచ్చని కొన్ని సంస్థలు సూచిస్తున్నాయి.

ఏ విధంగా చూసినా కమల దళానికి కన్నడ సీమలో పరాభవం తప్పేలా లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాని నేపథ్యంలో కాంగ్రెస్- జెడి(ఎస్) కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒక ఏడాది లోనే ఆ ప్రభుత్వాన్ని కూలదోసిన బిజెపి పెద్దలు, గోడ దూకిన ఎమ్మెల్యేల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని దక్షిణ భారతంలో బిజెపి కూల్చిన తొలి ప్రభుత్వం కర్ణాటకదే కావడం గమనార్హం.

దొడ్డి దారిన ఏర్పడిన బిజెపి ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన పాలనకు చిరునామాగా నిలిచింది. 40 శాతం కమిషన్ సర్కారుగా చీత్కారానికి గురైంది. ప్రతికూల అంశాలను మరిపించడానికి కర్నాటకను హిందూత్వ రాజకీయాల వేదికగా చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నది ఎగ్జిట్ పోల్స్ వివరాలను చూస్తే అర్ధమవుతోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రే మతపరంగా సున్నితమైన అంశాలను లేవనెత్తి, తానే కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థినన్న స్థాయిలో ప్రచారం చేసినా కన్నడిగులు కనికరించలేదని స్పష్టమవుతోంది.