అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం
మంటల్లో ‘మనం’ సెట్… నాగార్జున కంట కన్నీరు
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లెజండరీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకంగా మిగిల్చిన ‘మనం’ సినిమా సెట్ మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల తర్వాత అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని ఇటు నాగార్జున, అటు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
అక్కినేని వంశంలో మూడు తరాల నటులు కలసి చేసిన సినిమా ‘మనం’. ఈ మూవీకోసం అక్కినేనికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి సినిమా కావడం, ఆ సినిమా తర్వాత ఆయన మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నాగేశ్వరరావు గుర్తుగా ‘మనం’ సెట్ ను ఆయన ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోలో అలాగే ఉంచారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చివరి సినిమాలో నటించిన అక్కినేని.. ఈ సెట్ వద్దనే ఎక్కువ సమయం గడిపేవారట. సోమవారం అగ్ని ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న నాగార్జున తండ్రి జ్ఞాపకాలను మీడియాతో పంచుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు.