జీడీపీలో రూ. 2.4 లక్షల కోట్లు విదేశీ విద్యార్ధులవల్లనే...
విదేశీ విద్యార్ధుల్లో 17.3 శాతం ఇండియన్లే...అందులో ఆంధ్రులు గణనీయం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా (సాధారణ డాలర్లలో). ఆ వ్యవస్థ అంతగా వర్ధిల్లడంలో అనేక దేశాలు, వాటి వలస ప్రజానీకం పాత్ర గణనీయం. కేవలం అమెరికా చదువుకోసం వెళ్ళే విద్యార్ధుల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? జీడీపీకి రూ. 2.40 లక్షల కోట్ల విలువ జోడింపు, అమెరికన్లకు 4.50 లక్షల ఉద్యోగాలు. విదేశీ విద్యార్ధుల వల్ల ఈ జమిలి ప్రయోజనాలు ఉన్నట్టు అమెరికా యంత్రాంగం తేల్చింది. ఏటా అమెరికా రూపొందించే అంతర్జాతీయ విద్యార్ధుల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి.
ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఇ) నివేదిక ‘ఓపెన్ డోర్స్ 2017’ అమెరికాలోని విదేశీ విద్యార్ధుల వివరాలను, అమెరికానుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్ధుల వివరాలను వెల్లడించింది. దాని ప్రకారం... గత ఏడాది (2016-17లో) అమెరికాలో చదివిన విదేశీ విద్యార్ధుల సంఖ్య 10.78 లక్షలు. వారు ఫీజులకు, నివాసానికి, ఇతర ఖర్చులకు అమెరికాలో వెచ్చించిన మొత్తం 36.9 బిలియన్ డాలర్లు. అంటే... మన రూపాయల్లో సుమారు 2.40 లక్షల కోట్లు. అందులో ఎక్కువ భాగం స్వదేశాలనుంచి తీసుకెళ్లిందే. 6,50,960 మంది విదేశీ విద్యార్ధులు (60.3 శాతం) కుటుంబం నుంచి తెచ్చిన సొమ్మును అమెరికాలో వెచ్చించారు. మరో 1,77,773 మంది (16.5 శాతం) అమెరికాలో ఉద్యోగం చేయడం ద్వారా వచ్చిన సొమ్మును వినియోగించారు.
ఇక విదేశీ విద్యార్ధుల అమెరికాలో చదవడంవల్ల అక్కడివారికి వచ్చిన ఉద్యోగాలు 4,50,331. ఈ ఉద్యోగాల కల్పనలోనూ, అమెరికా ఆర్థిక వ్యవస్థకు విలువ జోడింపులోనూ ముందున్నది ఆసియా దేశాలే. ముఖ్యంగా ఇండియా, చైనా. అమెరికాలోని విదేశీ విద్యార్ధుల్లో కచ్చితంగా సగం చైనా, ఇండియాలనుంచి వెళ్లినవాళ్లే. అంటే విదేశీ విద్యార్ధుల వల్ల అమెరికా జీడీపీకి తోడైన 2.4 లక్షల కోట్లలోనూ, అమెరికన్లకు లభ్యమైన 4.5 లక్షల ఉద్యోగాలలోనూ ఈ రెండు దేశాల వాటా సుమారు సగం ఉంటుంది.
ఆంధ్రులు తక్కువేం కాదు
ఇండియా వరకే తీసుకుంటే.. అమెరికాలోని విదేశీ విద్యార్ధుల్లో వాటా 17.3 శాతం. అదే దామాషాలో చూస్తే.. అమెరికాలో విదేశీ విద్యార్ధులు సృష్టించిన ఉద్యోగాలలో సుమారు 78 వేలు, సృష్టించిన సంపదలో సుమారు రూ. 41,500 కోట్లు ఇండియన్ల వాటాగా చెప్పొచ్చు. ఇండియానుంచి అత్యధికంగా విద్యార్ధులను పంపే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. రాష్ట్రాలవారీగా ఎంతమంది వెళ్ళిందీ.. కచ్చితమైన గణాంకాలు లేవు. అయితే, సంప్రదాయంగానే ఆంధ్రులు అమెరికా చదువుల్లో ముందుంటున్నారు.
ఇటీవల ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా భారీగా ఆర్థిక సాయం చేసి మరీ విద్యార్ధులను విదేశీ చదువులకోసం పంపుతోంది. దీంతో ఏటా వేలాది మంది అదనంగా అమెరికా చదువులకు వెళ్తున్నారు. ఈ విధంగా చూస్తే విదేశీ విద్యార్ధుల వల్ల అమెరికాకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనం, ఉపాధి కల్పనలో ఆంధ్రుల వాటా గణనీయంగానే ఉంటుందని చెప్పవచ్చు.