నవంబర్ 2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించవలసిన రోజు. తెల్లవారితే శుక్రవారం. గురువారం ఆరంభిస్తే మరుసటి రోజే బ్రేకు వేసి… కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి. ఈ అనివార్యత రీత్యా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చారు. గురువారానికి బదులు తర్వాత వచ్చే సోమవారం (6వ తేదీన) పాదయాత్రను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వాయిదా పడటం ఇదే మొదటిసారి కాదు. అయితే, ఈసారి వాయిదా కోర్టు తీర్పు నేపథ్యంలో అనివార్యమైంది.
వచ్చే ఎన్నికలకోసం పార్టీని సమాయత్తం చేయడం, ప్రజల్లో ఆదరణ పెంచుకోవడం లక్ష్యాలుగా జగన్మోహన్ రెడ్డి ఆర్నెల్ల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఇడుపుల పాయలోని తమ వ్యవసాయ క్షేత్రంలో తండ్రి సమాధినుంచి మొదలుపెట్టి ఇఛ్చాపురం వరకు పాదయాత్ర చేయాలని జగన్ సంకల్పించారు. నిజానికి ఈ నెల చివరి వారంలోనే పాదయాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయించిన జగన్… నవంబర్ 2కు వాయిదా వేశారు.
తనపై ఉన్న కేసుల విచారణ నిమిత్తం ప్రతీ శుక్రవారం హాజరయ్యే నిబంధననుంచి మినహాయించాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తనకు అనుకూలంగా నిర్ణయం వెలువరిస్తుందన్న నమ్మకంతోనే రెండో తేదీ గురువారం పాదయాత్రారంభ సంరంభానికి ముహూర్తం పెట్టుకున్నారు. రెండో తేదీనుంచే పాదయాత్ర ప్రారంభమవుతుందని భావించిన వైసీపీ శ్రేణులు కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, పాదయాత్రకోసం విచారణకు హాజరు నుంచి మినహాయించేది లేదని కోర్టు సోమవారం తేల్చి చెప్పింది.
నిర్విరామంగా పాదయాత్ర చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి కోర్టు తీర్పు నిరాశ కలిగించింది. శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా పాదయాత్ర ప్రారంభ తేదీని మార్చుకున్నారు. ప్రతి వారం కూడా పాదయాత్రకు విరామం ఇచ్చి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన పరిస్థితి ఉంది. మిగిలిన రోజుల్లో ఎన్నిరోజులు పాదయాత్ర చేస్తారన్న విషయమై స్పష్టత లేదు. అయితే, నవంబర్ 3వ తేదీన కోర్టుకు హాజరైన తర్వాత 4వ తేదీన తిరుపతిలో వెంకటేశ్వరస్వామి దర్శన చేసుకొని ఆ తర్వాత 5వ తేదీన కడప దర్గా, చర్చిలలో ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారని సమాచారం. సర్వ మత ప్రార్థనల తర్వాత 6వ తేదీన పాదయాత్రకు శ్రీకారం చుడతారు.