కజువో ఇషిగురోకు సాహిత్యంలో నోబెల్
చరిత్రలోనే అణుదాడిని ఎదుర్కొన్న రెండు నగరాల్లో ఒకటైన నాగసాకిలో పుట్టి… బాల్య దశలోనే బ్రిటన్ వలస వెళ్లిన రచయిత కజువో ఇషిగురో సాహిత్యంలో నోబెల్ బహుమతిని సాధించారు. 2017 సంవత్సరానికి గాను ఒక్కో రంగంలో నోబెల్ బహుమతులను సాధించినవారి పేర్లను ఒక్కో రోజు ప్రకటిస్తున్న స్వీడిష్ అకాడమీ… గురువారం సాహితీ రంగపు నోబెల్ విజేతను ప్రకటించింది. నోవెలిస్టుగా స్క్రీన్ రైటర్ గా షార్ట్ స్టోరీ రైటర్ గా ఇషిగురో ప్రసిద్దుడు. ‘నెవెర్ లెట్ మీ గో’, ‘ద బరీడ్ జియాంట్’, ది రిమైన్స్ అఫ్ ది డే’ నవలలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రిమైన్స్ అఫ్ ది డే 1989లోనే మాన్ బుకర్ ప్రైజ్ ను గెలుచుకుంది. ఆ నవల ఆధారంగా వచ్చిన సినిమా ఆస్కార్ కు నామినెట్ అయింది.
అయితే, ఇషిగురో ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసారి నోబెల్ బహుమతి జపాన్ రచయిత హారుకి మురకామి లేదా అమెరికన్ రచయిత ఫిలిప్ రోత్ గానీ గెలుచుకుంటారని ఎక్కువ మంది చదువరులు భావించారు. గత ఏడాదినుంచి సాహితీ రంగం నోబెల్ విషయంలో సంప్రదాయ ప్రమాణాలకు భిన్నంగా ఎంపిక జరుగుతున్నట్టు పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం అమెరికన్ గాయకుడు-గేయ రచయిత బాబ్ డిలాన్ కు సాహిత్య నోబెల్ దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నోబెల్ రేసు మాట ఎలా ఉన్నా…ఇషిగురో రచనలు చాలా కాలంగా అంతర్జాతీయ సాహితీ యవనికపై చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్, భావోద్వేగాల గాఢత ఆయన రచనలకు పాపులారిటీని తెచ్చి పెట్టాయి. సాహితీ నోబెల్ బహుమతి కింద ఇషిగురోకు 9 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (1.1 అమెరికన్ డాలర్లు) దక్కనున్నాయి.