రూ. 65,00,000 కోట్ల ఆదాయం… ఫ్యూచర్ గ్రూపు విజన్ 2047

admin
1 0

ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో ఆసియా నెంబర్ 1 కావాలన్నది లక్ష్యం

ఫ్యూచర్ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2047 నాటికి ఆసియాలోనే అతిపెద్ద సమీకృత వినిమయ వ్యాపార సంస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ వ్యాపార సామ్రాజ్యంనుంచి అప్పటికి ట్రిలియన్ డాలర్లు (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ. 65 లక్షల కోట్లు) ఆదాయం సాధించాలన్నది ‘ఫ్యూచర్’ విజన్. సంస్థ సీఈవో కిషోర్ బియాని మంగళవారం తమ రిటైల్ వ్యాపార ప్రణాళిక 3.0 ను వెల్లడించారు. ఆ సరికొత్త రిటైల్ ఫార్మాట్ పేరు ‘తథాస్తు’.

ఈ ఫార్మాట్ లో ఏర్పాటయ్యే స్టోర్స్ కు 2000 మంది చొప్పున సభ్యులుంటారు. ఆన్ లైన్ లో సరుకు ఆర్డర్ చేయవచ్చు. డిస్కౌంట్లతో సరుకులు తీసుకోవచ్చు. 2022 నాటికి ఇలాంటి 10,000 ఈజీ డే స్టోర్లు కేవలం సభ్యులతో ప్రారంభించాలన్నది ఫ్యూచర్ లక్ష్యం. తద్వారా ఐదేళ్లనాటికి రూ. లక్షన్నర కోట్ల వ్యాపారం సాగించాలని భావిస్తున్నారు. 2018 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికే స్టోర్ల సంఖ్యను 1,100కు పెంచాలన్నది లక్ష్యం. 2022నాటికి కోటి మంది వినియోగదారులు ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున ఈజీడే స్టోర్ల ద్వారా ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నట్టు బియానీ చెప్పారు.

‘ఫ్యూచర్’ లక్ష్యంలో ఫేస్ బుక్, గూగుల్ కూడా భాగమవుతున్నాయి. ఈ టెక్నాలజీ దిగ్గజాలు అనలిటిక్స్ మద్ధతు ఇవ్వనున్నాయి. ఫేస్ బుక్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూపు డిజిటల్ యాడ్ భాగస్వామిగా ఉంది. ఇకపైన వినియోగదారుల ఆసక్తులపై లోతైన విశ్లేషణలు అందించనుంది. గూగుల్ లొకేషన్ ఆధారిత సేవలను అందిస్తుంది.

‘దేశంలో 30 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రోజుకు మూడు గంటల చొప్పన ఆన్ లైన్ లో ఉంటున్నారు. ఈజీడే స్టోర్లు ఎక్కడెక్కడ ప్రారంభించవచ్చో మ్యాపింగ్ చేయడంలో మేము సహకరిస్తాం’ అని గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ ఆనందన్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ తాజా వెంచర్ తో ఫ్యూచర్ గ్రూపు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ బ్రాండ్ గా మారుతుందని బియానీ అంచనా వేస్తున్నారు.

‘తథాస్తు’కోసం డేటా అనలిటిక్స్ సెంటర్ ను కోల్ కత నగరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్రాండ్ ను మొదటగా పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు.

Next Post

ఐదేళ్ళలో 50% పెరగనున్న బిలియనీర్లు

ట్రిలియన్ డాలర్ల ఆదాయంతో ఆసియా నెంబర్ 1 కావాలన్నది లక్ష్యంఫ్యూచర్ గ్రూపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి భారీ ప్రణాళిక […]
error

Enjoy this blog? Please spread the word