-
ఉదయాన్నే వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు..
-
పరిశుభ్రత, కాల్వల సుందరీకరణపై ఆదేశాలు..
రాష్ట్ర నూతన రాజధాని పేరుకు అమరావతి అయినా ఆచరణలో విజయవాడే చెలామణి అవుతోంది. సచివాలయం మాత్రమే వెలగపూడిలో ఉంది. ముఖ్యమంత్రి అడపాదడపా ఉపయోగిస్తున్న క్యాంపు కార్యాలయం, హెచ్ఒడిలు ఎక్కువ భాగం విజయవాడలోనే ఉన్నాయి. ఎయిర్ పోర్టు సహా రవాణా సౌలభ్యమూ విజయవాడనుంచే. రాష్ట్ర కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడ ఇప్పుడెలా ఉంది? ఎలా ఉండాలి? దానికి ఏం చేయాలి?
ఈ ప్రశ్నలకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు వివిధ ప్రాంతాల్లో కలియదిరిగారు. రోడ్లు, డ్రైన్లు, కాలువలు… ఇలా కనిపించినవన్నీ చూశారు. పారిశుధ్యం, కాల్వల సుందరీకరణ, వంతెనల నిర్మాణం వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సందర్శించిన ప్రాంతాలు, అధికారులకు ఇచ్చిన ఆదేశాల సమాహారమిది..
తొలుత విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న పార్క్ ను సందర్శించారు. ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్టాండ్ లోపలికి వెళ్లి అక్కడి పరిస్థతిని పరిశీలించారు. పండిట్ నెహ్రూ బస్టాండు నుంచి బయలుదేరి ఏలూరు రోడ్డు మీదుగా మాచవరం ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీ లో భాగంగా రామవరప్పాడు రింగ్ రోడ్డు ప్రాంతానికి వెళ్ళారు.
మధురానగర్ పడవలరేవు సెంటర్ లో రైవస్ కాల్వను సందర్శించారు. రైవస్ కాల్వ వెంబడి చేపట్టాల్సిన సుందరీకరణ పనులపై అధికారులకు సూచించారు. బీఆర్టీఎస్ మధురానగర్ వంతెనపై ఉన్న గుంతలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లోగా గుంతలు పూడ్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. బుడమేరు వంతెనను పరిశీలించిన ముఖ్యమంత్రి.. మొత్తంగా నగరంలోని కాల్వల్లోకి చెత్త వేయకుండా పారిశుధ్య చర్యలు తీసుకోవాలని నగర అధికారులకు సూచించారు.
నగరంలో ఒక ప్రణాళిక రూపొందించి నిర్ణీతకాలంలో సుందరీకరణ పనులు పూర్తి చేయాలన్న చంద్రబాబు.. వాంబే కాలనీ ప్రాంతంలోని డంప్ యార్డును పరిశీలించారు. వాంబే కాలనీ లో నిర్మాణంలో ఉన్న ఇళ్ల ను తనిఖీ చేసి మొదటి అంతస్థు వరకు వెళ్లి పరికించి చూశారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు.
తర్వాత ముఖ్యమంత్రి పాత ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో ని ప్రసూతి వార్డ్ లోపలికి వెళ్ళి అక్కడున్నవారితో మాట్లాడారు. ఇంకా పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ తనిఖీలలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కృష్ణా కలెక్టర్, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.