ఇంటర్ లోనూ ఇక గ్రేడింగ్!

విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు సర్కారు నిర్ణయం

కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు పెరిగిపోయిన నేపథ్యంలో ఒకానొక ఒత్తిడి నివారణ చర్యగా ఇంటర్ స్థాయిలోనూ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్కులను పూర్తిగా ఎత్తివేయకుండానే ఈ సంవత్సరం గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఎంసెట్ అడ్మిషన్లలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో.. విద్యార్ధులకు మార్కులు వేయడం ప్రస్తుతానికి తప్పదని భావిస్తున్నారు. అయితే, మార్కులను బయటకు వెల్లడించకుండా ఎంసెట్ అధికారులకు మాత్రమే పంపే ఆలోచన చేస్తున్నారు.

కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్ధుల ఆత్మహత్యోదంతాలు ప్రతిరోజూ ఏదో ఒక చోట అలజడికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా జోక్యం చేసుకొని సోమవారం కళాశాలల యాజమాన్యాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్కులకోసం ఒత్తిడి పెట్టే షెడ్యూళ్ళను మార్చుకోవాలని కళాశాలలను హెచ్చరిస్తూనే ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలనూ రేఖామాత్రంగా వెల్లడించారు. అందులో ప్రధానమైనది ఇంటర్ స్థాయిలో గ్రేడింగ్.

ఇదివరకు రాష్ట్రంలో పదో తరగతి స్థాయిలో గ్రేడింగ్ అమలవుతోంది. అయితే, ఎంసెట్ అడ్మిషన్లతో లింకు కారణంగా ఇంటర్ స్థాయిలో మార్కుల ప్రకటనకు స్వస్తిపలికే ఆలోచన చేయలేదు. తాజాగా విద్యార్ధుల ఆత్మహత్యలతో ఇటు ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరిగింది. ఇంటర్ స్థాయిలో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి సోమవారంనాటి సమావేశంలో విద్యాశాఖను ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఈ ఏడాదినుంచే గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

Leave a Comment