2017-18 జీవీఏ అంచనా తగ్గించిన రిజర్వ్ బ్యాంకు
జాతీయ వృద్ధి రేటును భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గణనీయంగా తగ్గించింది. 2017-18 సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థకు అన్ని రంగాలు జోడించే విలువ (జీవీఏ) కేవలం 6.7 శాతం వృద్ధి చెందుతుందని తాజాగా అంచనా వేసింది. జీవీఏ వృద్ధి రేటు 7.3 శాతం ఉంటుందని గతంలో అంచనా వేసిన రిజర్వ్ బ్యాంకు... బుధవారం వెలువరించిన మోనిటరీ పాలసీ ప్రకటనలో 0.6 శాతం మేరకు తగ్గించింది. గత జూలైలో అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను ప్రస్తుతానికి ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. సమీప భవిష్యత్తులో తయారీ రంగంలో అనిశ్చితి కొనసాగుతుందని, పెట్టుబడులు ఆలస్యమవుతాయని, బ్యాంకులు-కార్పొరేట్ల బాలన్స్ షీట్లపై ఈ ప్రభావం ఉంటుందని రిజర్వ్ బ్యాంకు విశ్లేషించింది.
గత జూన్ మాసంతో ముగిసిన తొలి త్రైమాసికంలో జీవీఏ వృద్ధి కేవలం 5.6 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన రిజర్వ్ బ్యాంకు రిపోర్టు ఆర్ధిక మందగమనం మరికొంత కాలం ఉంటుందని తేల్చి చెప్పింది. మరో వైపు వడ్డీ రేట్లను తగ్గించాలన్న డిమాండ్లను రిజర్వ్ బ్యాంకు పట్టించుకోలేదు. బుధవారం నాటి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో.. బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రెపో రేటును మార్చడానికి నిరాకరించారు. ఆరుగురు సభ్యుల కమిటీలో ఉన్న రవీంద్ర డోలాకియా 25 బేసిస్ పాయింట్ల కోతకు మొగ్గు చూపారు. సమావేశం తర్వాత రిజర్వ్ బ్యాంకు చేసిన ప్రకటన ప్రకారం.. రెపో రేటు 6 శాతంగానే ఉంది. 'స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో'ను మాత్రం 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు.