హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్ళేవారికి నేటినుంచి బిల్లు కొంత తగ్గే అవకాశం ఉంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ఐదు శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ రోజునుంచే అమల్లోకి వచ్చింది. ఇకపైన పెద్ద స్టార్ హోటళ్ళు మినహా మిగిలిన అన్ని ఏసీ, నాన్ ఏసీ హోటళ్లలోనూ సమానంగా 5 శాతమే పన్ను వసూలు చేయవలసి ఉంటుంది.
ఏ హోటళ్ళలో రూమ్ రెంట్ రూ. 7,500 కంటే ఎక్కువ ఉంటుందో అక్కడి రెస్టారెంట్లలో మాత్రం ఇప్పటిలాగే 18 శాతం పన్ను కొనసాగుతుంది. రూ. 7,500 కంటే గది అద్దెలు తక్కువ ఉన్న రెస్టారెంట్లలో తినుబండారాలపై కేవలం 5 శాతం పన్ను ఉంటుంది. ఇంతకు ముందు ఏసీ రెస్టారెంట్లు 18 శాతం, నాన్ ఏసీ రెస్టారెంట్లు 12 శాతం చొప్పున వినియోగదారులనుంచి పన్ను బాదేవి.
కాంపొజిషన్ పథకంలో నమోదైన హోటళ్ళయితే ఐదు శాతం పన్ను పరిధిలో ఉన్నాయి. గత జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు.. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లన్నిటిలోనూ ఐదు శాతమే పన్ను విధించాలి. పన్ను తగ్గించిన నేపథ్యంలో… రెస్టారెంట్లకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) ఇకపైన ఉండదు. 18 శాతం పన్ను చెల్లించే స్టార్ హోటళ్ళకు మాత్రం ఐటిసి కొనసాగుతుంది.
ఐటిసి తొలగించి పన్ను తగ్గించినా.. తినుబండారాల రేట్లు తగ్గవని, పైగా పెరిగే అవకాశం ఉందని రెస్టారెంట్ల యజమానులు వాదిస్తున్నారు. అయితే… 12, 18 శాతం పన్ను రేట్లు అమలైనప్పుడు కూడా రెస్టారెంట్లు ఐటిసి ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించలేదని, ఈ నేపథ్యంలో తగ్గించిన పన్ను వినియోగదారులకు ప్రయోజనమేనని జీఎస్టీ కౌన్సిల్ పేర్కొంది.
మరి ఆచరణలో వినియోగదారులకు బిల్లు తగ్గిస్తారా.. లేదా? ఏసీ రెస్టారెంట్లలో అయితే ఖాతాదారులకు ఏకంగా 13 పర్సంటేజ్ పాయింట్లు బిల్లలో తగ్గాలి. అంటే.. 500 బిల్లు చేస్తే 65 రూపాయలు మిగలాలి. గతంలో 90 రూపాయలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు 25 రూపాయలతో సరిపోతుంది. ఇక నాన్ ఏసీ రెస్టారెంట్లలో అయితే ఏడు పర్సంటేజ్ పాయింట్లు తగ్గాలి. అంటే… 500 బిల్లుపైన 35 రూపాయలు ఆదా అవుతుంది.
రెస్టారెంట్లు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు కాబట్టి బిల్లు మొత్తం తగ్గించబోమంటే వినియోగదారులు మొబైల్ అప్లికేషన్లలో ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కొన్ని ఫుడ్ యాప్స్ సవరించిన ఐదు శాతం పన్నుకే ఇంటివద్దకు సరఫరా చేయడానికి సిద్ధపడుతున్నాయి.